South Africa Cricket : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023-25) ఫైనల్‌పై ఆశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికా(South Africa)కు గుడ్ న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) మళ్లీ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరమైన బవుమా ఫిట్నెస్ పరీక్షలో గట్టెక్కాడు. దాంతో, శ్రీలంకతో రెండు సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా సెలెక్టర్లు అతడికే పగ్గాలు అప్పగిస్తూ స్క్వాడ్‌ను ఎంపిక చేశారు.
అనుకున్నట్టే స్టార్ పేసర్ లుంగి ఎంగిడి (Lungi Ngidi) శ్రీలంక సిరీస్‌కు దూరం కానున్నాడు. దాంతో, పేస్ దళానికి సీనియర్ ఆటగాడు కబిసో రబడ నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంకతో జరుగబోయే రెండు టెస్టుల సిరీస్‌లోనూ విజయం సాధిస్తే బవుమా బ్యాచ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంటుంది.
Temba Bavuma has passed a fitness test and will lead South Africa in the upcoming Test series against Sri Lanka #SAvSL pic.twitter.com/lyWoox0yeF
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2024
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగమ్, టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, రియాన్ రికెల్టన్, కేల్ వెర్రిన్నే, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఏడెన్ మర్క్రమ్, వియాన్ మల్డర్, సెనురన్ ముతుస్వామి, డేన్ పేటర్సన్, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ.
బవుమా గైర్వాజరీలో దక్షిణాఫ్రికాకు ఎడెన్ మర్క్రమ్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సఫారీ జట్టు 2-0తో సిరీస్ గెలుపొంది చరిత్ర సృష్టించింది. దాంతో, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా ఐదో స్థానానికి దూసుకొచ్చింది. టెస్టు సిరీస్ షెడ్యూల్ చూస్తే.. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో నవంబర్ 27 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. అనంతరం డిసెంబర్ 5 నుంచి సెయింట్ జార్జ్స్ పార్క్‌లో రెండో టెస్టులో సపారీ, లంక జట్లు తలపడనున్నాయి.