మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై(Nuclear Doctrine) రూపొందించిన కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నూతన అణ్వాయుధ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. తమ శత్రు దేశానికి మద్దతు ఇచ్చే దేశాల వద్ద సుదీర్ఘ దూరం ప్రయాణించే మిస్సైళ్లు ఉన్నప్పుడు, ఆ దేశంపై అణ్వాయుధంతో దాడి చేసేందుకు తాము కూడా సిద్ధంగా ఉంటామని ఇటీవల రష్యా ఓ కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసింది. దాని ప్రకారం ఉక్రెయిన్‌కు సపోర్టు ఇచ్చే దేశాలపై కూడా అటాక్ చేసేందుకు వెనుకాడబోమని రష్యా ఇవాళ్టి ప్రకటనతో స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి వెయ్యి రోజులు అయ్యింది. ఈ నేపథ్యంలో పుతిన్ కొత్త ముసాయిదాకు లైన్ క్లియర్ చేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. నాటో దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో అణ్వాయుధ వినియోగంపై రష్యా కొత్త విధానాన్ని రూపొందించింది. ఏ దేశం కవ్వింపు చర్యకు పాల్పడినా.. ఆ దేశంపై అటాక్ చేసేందుకు వెనుకాడమోమని రష్యా తేల్చి చెప్పింది. సరిహద్దు వద్ద ఎటువంటటి సైనిక నిర్మాణం చేపట్టినా అది కవ్వింపు చర్యే అవుతుందని రష్యా తెలిపింది.
శత్రు దేశాలకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్, మిస్సైళ్లు, డ్రోన్లు, ఆయుధాలు ఏవైనా రష్యా వైమానిక క్షేత్రంలోకి వస్తే, అప్పుడు వాటికి అణ్వాయుధాలతో సమాధానం చెప్పేందుకు ఆ దేశం సిద్దమైంది. అణ్వాయుధ దాడి చేసేందుకు రష్యా అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. రష్యాలోని సుదూర ప్రాంతాలపై అటాక్ చేసేందుకు ఉక్రెయిన్‌కు ఇటీవల అమెరికా లాంగ్ రేంజ్ మిస్సైళ్లను అప్పగించింది. ఈ నేపథ్యంలో పుతిన్ కొత్త అణ్వాయుధ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు.