హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ యువ స్కేటర్ ప్రణవ్ మాధవ్ సత్తాచాటాడు. అస్తానా(కజకిస్థాన్) వేదికగా జరుగనున్న షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ ప్రపంచకప్ టోర్నీకి ప్రణవ్ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న తొలి తెలంగాణ స్కేటర్‌గా ప్రణవ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఈ మెగాటోర్నీలో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు ఎంపిక కాగా, అందులో ప్రణవ్ ఒకడు కావడం విశేషం. ప్రణవ్ ఐస్ స్కేటింగ్ ప్రయాణం ఆసక్తికరం. ఏడేండ్ల వయసులో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా యూసుఫ్‌గూడ స్టేడియంలో ప్రణవ్ కెరీర్ మొదలైంది. ఎమ్ఏ ఖాదిర్ కోచింగ్‌లో ఈ కుర్రాడు రోజురోజుకు రాటుదేలాడు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నాడు.