పినపాక, జనవరి 10 : జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్ చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మౌరి టెక్, కంది ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలు నాల్గవ రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. ప్రీ క్వార్టర్స్ విభాగంలో 8, క్వార్టర్లో 8 మ్యాచ్‌లు జరుగగా రెండింట్లోనూ తెలంగాణ జట్టు అదరగొట్టింది. తొలుత కేరళపై 62-58 పాయింట్లతో, ఆ తర్వాత 68-46తో పంజాబ్‌పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
దీంతో క్రీడా మైదానం ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తింది. ప్రీ క్వార్టర్స్‌లో పం జాబ్.. 57-56 పాయింట్లతో విద్యాభారతిపై, ఉత్తరప్రదేశ్ 70-44తో ఆంధ్రప్రదేశ్‌పై, పాండిచ్చేరి 49-44తో గుజరాత్‌పై, రాజస్థాన్ 55-37తో మణిపూర్‌పై, కర్ణాటక 63-44 తో సీబీఎస్ఈపై, హర్యానా 67-33తో మధ్యప్రదేశ్‌పై, తమిళనాడు 53-40తో మహారాష్ట్రపై విజయం సాధించాయి. క్వార్టర్స్ పోరు లో ఉత్తరప్రదేశ్, హర్యానా గెలుపొందాయి. రాజస్థాన్, కర్ణాటక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం నాటికి వాయిదాపడింది.