హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని గచ్చిబౌలిలో గల జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 72వ మహిళల సీనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పూల్-సీలో ఆతిథ్య జట్టు.. 50-16తో పుదుచ్చేరిపై ఘనవిజయం సాధించింది. రైడర్లు పాయింట్ల వర్షం కురిపించడంతో తెలంగాణ విజయం నల్లేరుపై నడకే అయింది. స్థానిక ప్రేక్షకుల మద్దతుతో తెలంగాణ ఆటగాళ్లు రెచ్చిపోయి వరుస పాయింట్లతో సత్తాచాటారు. ఇదే పూల్‌లో రాజస్థాన్, రైల్వేస్ జట్లూ విజయాలు సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రైల్వేస్.. 88-12తో జమ్మూకాశ్మీర్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదుచేసింది.