నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో మన తెలంగాణ నుంచి యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పోటీకి దిగుతున్నది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి..అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తున్నది. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు సిద్ధమైంది.
ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రస్తుత జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణలో రాటుదేలిన దీప్తి..అంచలంచెలుగా ఒలింపిక్స్ స్థాయికి ఎదిగింది. కెరీర్ తొలి నాళ్లలో సాధారణ అథ్లెట్లతో పోటీపడ్డ దీప్తి..ఆ తర్వాత పారా అథ్లెటిక్స్ వైపు కెరీర్ మలుచుకుంది.
మేధోపరమైన సమస్యలతో బాధపడుతున్న దీప్తి..పారా అథ్లెటిక్స్‌లో పతకాల పంట పండిస్తున్నది. పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల టీ20 400మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతున్న దీప్తి..పసిడి కాంతులు విరజిమ్మాలని చూస్తున్నది. గత మే నెలలో కోబ్(జపాన్)లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 55.07సెకన్ల టైమింగ్‌తో వరల్డ్ రికార్డు తన పేరిట లిఖించుకుంది.
తద్వారా ప్రపంచ పారా టోర్నీలో స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా దీప్తి రికార్డుల్లోకెక్కింది. సరైన ఆర్థిక మద్దతు లేక కెరీర్ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న దీప్తి ప్రస్తుతం స్పాన్సర్ల దృష్టిని ఆకర్షించింది. బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ ఆర్థిక సహకారంతో అంతర్జాతీయ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నది.