గ్రేటర్ నోయిడా: ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీలో భారత బాక్సర్లు పసిడి పతకాలతో దుమ్మురేపారు. టోర్నీలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలతో కొత్త చరిత్ర లిఖించారు. షాహిద్ విజయ్‌సింగ్ పతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అశేష అభిమానుల మధ్య జరిగిన టోర్నీలో మన బాక్సర్లు ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపించారు. పసిడి పతక ప్రదర్శనలో అమ్మాయిలదే అగ్రభాగం కాగా, పురుషులు ద్వితీయ స్థానానికి పరిమితమయ్యారు. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు జాస్మిన్ లంబోరియా(57కి), పర్వీన్(60కి), మీనాక్షి(48కి), ప్రీతి(54కి), అరుంధతి(70కి), నుపుర్(80+కి) పసిడి పతకాలు కైవసం చేసుకోగా, సచిన్(60కి), హితేశ్(70కి) అగ్రస్థానం దక్కించుకున్నారు.
గురువారం జరిగిన మహిళల 51కిలోల ఫైనల్ పోరులో యువ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0 తేడాతో గువో యి జువాన్(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్..తుదిపోరులో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆది నుంచే తనదైన రీతిలో పవర్ఫుల్ పంచ్‌లు విసురుతూ ముప్పేట దాడికి పాల్పడింది. చైనీస్ తైపీ బాక్సర్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది.
నిఖత్ విసిరిన క్లీన్ పంచ్‌లకు రిఫరీలు పూర్తి పాయింట్లతో మొగ్గుచూపారు. చైనీస్ తైపీ బాక్సర్ పుంజుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆధిక్యం దక్కించుకున్న నిఖత్ విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ నిజామాబాద్ బాక్సర్ సాధించిన తొలి మెగాటోర్నీ పతకం ఇదే. మరోవైపు 57కిలోల విభాగంలో జాస్మిన్ లంబోరియా 4-1తో ఒలింపిక్ పతక విజేత వు షిహ్(చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది.