Mohammed Siraj | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ క్రికెటర్, టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్లేయర్‌గా ఏడేండ్లుగా సేవలు అందిస్తుండటమేకాక, ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన బృందంలో ఉన్న సిరాజ్‌కు ఉచితంగా స్థలాన్ని అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు పలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు స్థలాలను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రఘునాథపాలెం, బల్లేపల్లిలో కలిపి 52.26 ఎకరాలను కేటాయించారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో శ్రీ స్వామినారాయణ అంతర్జాతీయ గురుకుల పాఠశాల ఏర్పాటుకు 13.10 ఎకరాలను కేటాయించారు. ఎకరాకు రూ.11.25 లక్షలను మంజూరు చేశారు. గురుకులాలకు భవనాల నిర్మాణం కోసం నిర్మల్ జిల్లా సారంగపూర్‌లో 6 ఎకరాలు, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లిలో 11 ఎకరాలను కేటాయించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లోని 6.23 ఎకరాల స్థలాన్ని, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 6.18 ఎకరాలను టీజీఐఐసీకి అప్పగించారు.
ట్రాఫిక్ ట్రెయినింగ్ సెంటర్ నిర్మాణం కోసం కామారెడ్డి జిల్లా క్యాసపల్లిలో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కేంద్ర హోంశాఖకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 800 చదరపు గజాలు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం కోసం నల్గొండ జిల్లా గొల్లగూడలో 10 గుంటల స్థలాన్ని, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏడున్నర గుంటలను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.