Indian Football : భారత ఫుట్‌బాల్ జట్టు సొంత గడ్డపై అదరగొడుతోంది. సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) సారథ్యంలోని టీమిండియా ఈమధ్యే ఇంటర్ కాంటినెంటల్ కప్(Intercontinental Cup) విజేతగా అవతరించింది. అంతేకాదు శాఫ్ చాంపియన్‌షిప్(SAFF Championship 2023)లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. కువైట్ జట్టుతో రేపు అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం భారత జట్టు జోరు చూస్తుంటే పూర్వ వైభవం సాకారమవుతుందని అనిపిస్తోంది. అవును.. స్వాత్రంత్యం ముందే భారత్‌కు ఈ ఆటలో ప్రత్యేకత స్థానం ఉంది. అయితే.. ఆ తర్వాత కాలంలో క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో ఒకింత ప్రాభవాన్ని కోల్పోయింది.
ఈ ఏడాది టీమ్ఇండియా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచింది. ఇంటర్కాంటినెంటల్ కప్‌లో భారత్ విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఫైనల్లో లెబనాన్‌పై 2-0తో గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. రెండేసి గోల్స్ చేసిన సునీల్ ఛెత్రీ, లాల్జింగులా చాంగ్టె టాప్‌లో నిలిచారు. బెంగళూరులో జరుగుతున్న దక్షిణాసియా ఫుట్‌బాల్(సాఫ్) చాంపియన్‌షిప్‌లోనూ ఫైనల్ చేరింది. లెబనాన్(Lebanon)తో జరిగిన సెమీ ఫైనల్లో షూటౌట్లో 4-2తో చిరస్మరణీయ విజయం సాధించింది. ఛెత్రీ నాయకత్వంలో సంచలన ఆటతో ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తోంది.
సునీల్ ఛెత్రీ
టీమిండియా జోరు వెనక.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అపార అనుభవమున్న కోచ్ ఇగోర్ స్టిమాక్(Igor Stimac) పాత్ర ఉంది. అతడి శిక్షణలో భారత జట్టు రోజురోజుకు రాటుదేలుతోంది. గతంలో సునీల్ ఛెత్రీపై ఆధారపడ్డ టీమ్ఇండియా సమిష్టి ఈమధ్య ప్రదర్శనతో సత్తా చాటుటోంది. వరుస విజయాలు సాధిస్తున్న భారత్ ఫిఫా ర్యాంకింగ్స్‌లో 100వ ర్యాంక్‌లో నిలిచింది. అంతేకాదు భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్లో రాకెట్లా దూసుకెళుతున్నాడు. 92 గోల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. రొనాల్డో (123), అలీ దాయి (109), మెస్సీ (103)లు ఛెత్రీ కంటే ముందున్నారు.