England – BazzBall : టెస్టు క్రికెట్లో ‘బాజ్‌బాల్'(BazzBall) అనే సరికొత్త ఆటను పరిచయం చేసిన ఇంగ్లండ్(England) యాషెస్ సిరీస్(Ashes Series)లో బొక్కాబోర్లా పడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు నమ్ముకున్న బాజ్‌బాల్ వ్యూహం బెడిసి కొట్టింది. వరల్డ్ నంబర్ 1ఆస్ట్రేలియా(Australia) జోరకు కళ్లెం ఎలా వేయాలో ఆతిథ్య జట్టుకు అర్ధంకావడం లేదు. రెండో టెస్టులో కెప్టెన్ బెన్‌స్టోక్స్(155) వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. దాంతో, ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో వెనకబడింది. మరోవైపు మాజీ క్రికెటర్లు స్టోక్స్ సేన వైఫల్యాన్ని సోషల్‌మీడియా వేదికగా ఎండగడుతున్నారు.
జో రూట్(JoeJRoot) నుంచి బెన్ స్టోక్స్(Ben Stokes) టెస్టు జట్టు పగ్గాలు అందుకోవడంతో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) రావడంతో ఇంగ్లండ్ ఆటే మారిపోయింది. టెస్టు క్రికెట్లో ధనాధన్ ఆడి వేగంగా పరుగులు రాబట్టడమే బాజ్‌బాల్ గేమ్ అంతర్యం. సంప్రదాయ క్రికెట్‌కు పెట్టింది పేరైన ఇంగ్లండ్ టీమ్.. ఆ ముద్రను తొలగించుకొని దూకుడుగా ఆడడం మొదలెట్టింది. మొదట్లో బజ్‌బాల్ ఆట వాళ్లకు మంచి ఫలితాలనే అందించింది. అయితే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్(Ashes Series)లో మాత్రం ఇంగ్లండ్ అస్త్రం పనిచేయడం లేదు. తొలి టెస్టులో మొదటి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి స్టోక్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ వన్డే తరహాలో ఆడింది. వికెట్లు పడుతున్నా కూడా 78 ఓవర్లలో 5.03 రన్‌రేట్‌తో 393 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో ఊపు మీదుండగా తొలి ఇన్నింగ్స్‌ను స్టోక్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆఖరి సెషన్లో ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించి దెబ్బకొట్టాలనేది అతడి ఉద్దేశం. కానీ, 4 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడిన కంగారూ ఓపెనర్లు వికెట్ పడకుండా రోజును ముగించారు.
తొలి టెస్టులో ఆసీస్‌ను గెలిపించిన కమిన్స్, లియాన్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటవ్వడంతో ఆతిథ్య జట్టుకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 273 పరుగులకు ఆలౌట్ కాగా… 281 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కమిన్స్(55 నాటౌట్) చివరివరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
తొలి టెస్టు ఓటమి నుంచి ఇంగ్లండ్ పాఠాలు నేర్చుకోలేదు. స్టార్ ఆటగాళ్లు విఫలం కావడంతో కెప్టెన్ బెన్ స్టోక్స్(155) ఒంటరి పోరాటం చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 371 పరుగుల లక్ష్యఛేదనలో 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ పరిస్థితిలో మరే జౖట్టెనా మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకునేందుకు ఆసక్తి చూపేది.. కానీ అందుకు భిన్నంగా బెన్ డకెట్(83), స్టోక్స్ ఎదురుదాడికి దిగి కంగరూలను భయపెట్టారు.
వీరోచిత సెంచరీ బాదిన బెన్ స్టోక్స్(155)
జానీ బెయిర్‌స్టో వివాదాస్పద రనౌట్ తర్వాత.. స్టోక్స్ వీరవిహారం చేశాడు. 9 ఫోర్లు, 9 బౌండ్రీలతో మైదానాన్ని హోరెత్తించాడు. ఒక దశలో 301/6తో లక్ష్యానికి చేరువైన ఇంగ్లిష్ టీమ్.. స్టోక్స్ ఔట్ కావడంతో కుప్పకూలింది. లక్ష్యానికి 43 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అయితే.. మ్యాచ్ ఓడినా తమ దృక్పథంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ అన్నాడు. భవిష్యత్తులోనూ ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటను కొనసాగిస్తుందని చెప్పకనే చెప్పాడు.