Suryakumar Yadav – Devisha : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విధ్వంసక ఆటతో ఫ్యాన్స్‌ను అలరించిన విషయం తెలిసిందే. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతను ముంబై ఇండియన్స్(Mumbai Indians) ‘ప్లే ఆఫ్స్’ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023) ముగియడంతో అతను ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు.
వెకేషన్లో ఉన్న సూర్య మధ్యధరా సముద్రంలోని ఇబిజా దీవి(Ibiza islands)లో భార్య దెవిషతో కలిసి సేదతీరుతున్నాడు. తాజాగా తమ టూర్‌కు సంబంధించిన వీడియోను దివిష ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మూడు రోజులు.. 30 సెకన్లలో అని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టింది.
అందులో సూర్య, దెవిష విమానంలో ఉన్న ఫొటోలు, వాళ్లు బస చేసిన హోటల్ గది, మెరీడియన్ ఫుడ్ ఆస్వాదించడం, సముద్ర తీరం అందాలు, బీచ్‌లో సేదతీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఐపీఎల్లో తొలి సెంచరీ కొట్టిన సూర్య
ఐపీఎల్ 16వ సీజన్లో చితక్కొట్టిన సూర్య ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో అతను తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడిని ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. కానీ… ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. పైగా వెస్టిండీస్ పర్యటనకు దాదాపు 25 రోజుల సమయం ఉంది. దాంతో, సూర్య తన భార్య దెవిషతో కలిసి టూర్ ప్లాన్ చేశాడు. విండీస్ టూర్లో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. వన్డేలు, టీ20ల్లో దంచి కొట్టాలని ఈ విధ్వంసక ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు.