మాంచెస్టర్: సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు డ్రా కోసం తండ్లాడుతున్నది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు ఏకంగా 311 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న టీమ్ఇండియా.. నాలుగో రోజు ఆట చివరికి 63 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 137 రన్స్ వెనుకబడి ఉంది.
సున్నాకే రెండు వికెట్లు పడ్డ దశలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87 నాటౌట్, 8 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్‌తో తన విలువను చాటుకోగా నాలుగో స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ (167 బంతుల్లో 78 నాటౌట్, 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అజేయమైన మూడో వికెట్‌కు ఈ జోడీ ఇప్పటికే 373 బంతులాడి 174 పరుగులు జోడించింది. ఈ టెస్టులో గెలుపు సంగతి దేవుడెరుగు! కానీ.. ఐదో రోజు మొత్తం ఇంగ్లండ్ బౌలర్లను అడ్డుకోవడమే ప్రస్తుతం గిల్ సేన ముందున్న తక్షణ కర్తవ్యం. ఇక ఆరు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 669 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 141, 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకం బాదగా బ్రైడన్ కార్స్ (47) అతడికి అండగా నిలిచాడు.
ఐదో రోజు ఆట ఆరంభంలోనే డాసన్ (26)ను క్లీన్‌బౌల్డ్ చేసి బుమ్రా భారత్‌కు బ్రేక్ఇచ్చినా ఇంగ్లండ్ సారథి వన్‌మెన్ షోతో ఆ జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. సిరాజ్ ఓవర్లో బౌండరీతో అతడు సుమారు మూడేండ్ల విరామం తర్వాత టెస్టుల్లో శతకాన్ని నమోదుచేశాడు. టెస్టుల్లో స్టోక్స్‌కు ఇది 14వ సెంచరీ. ఆ తర్వాత అతడు దూకుడు పెంచాడు. స్పిన్నర్లు జడేజా, వాషింగ్టన్‌ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆతిథ్య జట్టు ఆధిక్యం 300కు చేరువైంది. ఎట్టకేలకు జడ్డూ.. స్టోక్స్‌తో పాటు కార్స్నూ పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
టీమ్ఇండియాను వోక్స్ తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. నాలుగో బంతికి జైస్వాల్ (0), ఐదో బంతికి సుదర్శన్ (0) స్లిప్స్‌లో రూట్, బ్రూక్ పట్టిన క్యాచ్‌లతో పెవిలియన్ చేరారు. స్కోరుబోర్డుపై పరుగులేమీ చేయకుండానే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.
సున్నాకే రెండు కీలక వికెట్లు నష్టపోయిన భారత్‌ను రాహుల్, గిల్ ఆదుకున్నారు. ఇంగ్లిష్ బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేస్తూ ఈ జోడీ క్రీజులో కుదురుకునేదాకా డిఫెన్స్‌నే ఆశ్రయించింది. ఇంగ్లండ్ పేసర్లు పదే పదే కవ్వించే బంతులేసినా వాటి జోలికి పోకుండా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించారు. అడపాదడపా గిల్ బౌండరీలతో అలరించినా రాహుల్ మాత్రం ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
రెండో సెషన్ డ్రింక్స్ విరామం తర్వాత 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డీప్ పాయింట్లో డాసన్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన గిల్.. తన కెరీర్లో 8వ అర్ధ శతకం పూర్తిచేశాడు. టీ విరామం తర్వాత రాహుల్ కూడా 140 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో సెషన్ 26 ఓవర్లు ఆడి 85 రన్స్ జోడించిన ఈ ద్వయం.. మూడో సెషన్లోనూ అదే పట్టుదలను ప్రదర్శించింది. స్పిన్నర్ డాసన్ కొంత ఇబ్బందిపెట్టినా ఈ ద్వయం పట్టు విడవకుండా ఆడి మరో వికెట్ పడకుండా చూసుకుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ ;ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 157.1 ఓవర్లలో 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, జడేజా 4/143, సుందర్ 2/107) : భారత్ రెండో ఇన్నింగ్స్: 63 ఓవర్లలో 174/2 (రాహుల్ 87*, గిల్ 78*, వోక్స్ 2/48)