India Vs SA ODI | లక్నోలో జరిగిన తొలి వన్డేలో జరిగిన ఓటమికి టీం ఇండియా బదులు తీర్చుకున్నది. ఆదివారం జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో సఫారీలపై టీం ఇండియా 25 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో 282 పరుగులు చేధించి విజయం సాధించింది. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి శ్రేయస్ అయ్యర్ 113, సంజూ శామ్సన్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లు బ్జోర్ ఫార్టౌన్, వాయ్నే పార్నెల్, కగిసో రబడా ఒక్కో వికెట్ తీసుకున్నారు.
279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఓపెనర్లు శిఖార్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్.. వెంటవెంటనే ఔటయినా.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ నిలకడగా.. ఆచితూచీ ఆడుతూ.. వీలు చిక్కినప్పుడు బ్యాట్ ఝుళిపిస్తూ.. బంతిని స్టాండ్స్‌లోకి పంపుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 35వ ఓవర్లో ఫోర్టైన్ వేసిన మూడో బంతిని మిడ్ వికెట్ మీదుగా ఇషాన్ కిషాన్ షాట్ కొట్టాడు. కానీ హెండ్రిక్స్ క్యాచ్ పట్టడంతో ఇషాన్ (93) ఇన్నింగ్స్ ముగిసింది. ఏడు పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయింది.
ఇషాన్ కిషాన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శామ్సన్.. శ్రేయస్ అయ్యర్‌కు తోడయ్యాడు. శామ్సన్, శ్రేయస్ అయ్యర్ వీలు చిక్కినప్పుడు బంతిని బౌండరీకి, స్టాండ్స్‌కు పంపుతూ.. అడపదడపా సింగిల్స్ తీస్తూ స్కోర్‌ను వడివడిగా ముందుకు తీసుకెళ్లారు. 43వ ఓవర్లో రబడా వేసిన రెండో బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీకి మళ్లించడంతో శ్రేయస్ అయ్యర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాలో అడెన్ మార్క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 పరుగులు చేసినా ఉపయోగం లేకపోయింది.