గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే భారత జట్టు ఇంటి దారి పట్టింది. ఆ అవమానానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈసారి కూడా భారత జట్టు కనీసం సెమీస్ చేరదని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అంటున్నాడు.
ఒక ప్రముఖ వార్తా సంస్థలో జరిగిన చర్చా వేదికలో ఊతప్ప పాల్గొన్నాడు. దీనిలో అనిల్ కుంబ్లే, శ్యామ్ బిల్లింగ్స్, ఫాఫ్ డు ప్లెసిస్, స్టీఫెన్ ఫ్లెమింగ్, టామ్ మూడీ, ఫర్వీజ్ మహరూఫ్, డారెన్ గంగ ఉన్నారు. వీళ్లందరూ కూడా ఈసారి ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఊతప్ప మాత్రం తన లిస్టు నుంచి భారత్‌ను తొలగించాడు.
‘నా నిర్ణయం భారత అభిమానులకు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ నా అంచనా ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా సెమీస్ చేరతాయి’ అని వెల్లడించాడు. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశం ఉందని సమాచారం.