ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 250 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో కివిస్ వెనుక పడింది. కన్ విలియమ్సన్, మిచెల్ శాంత్నర్, విల్ యంగ్ మినహా మిగతా బ్యాటర్లెవరూ క్రీజ్‌లో నిలబడలేక పోయారు. 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్దేశిత 50 ఓవర్లలో మరో 27 బంతులు మిగిలి ఉండగానే 205 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్‌పై టీం ఇండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించి.. సెమీస్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో టీం ఇండియా తల పడనున్నది.
250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివిస్ ఓపెనర్లు విల్ యంగ్, రుచిన్ రవీంద్రల్లో రవీంద్రను ఆరు పరుగులకే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అక్సర్ పటేల్ క్యాచ్ పట్టి పెవిలియన్ బాట పట్టించాడు. అటుపై 49 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో విల్ యంగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్‌గా వచ్చిన కేన్ విలియమ్సన్ .. సహచర బ్యాటర్లు ఔటవుతున్నా నిలకడగా ఆడుతూ 81 పరుగులు చేశాడు. కానీ 41వ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన చివరి బంతిని కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి కేన్ విలియమ్సన్ ఔట్ కావడంతో కివిస్ ఆట కట్టించారు. డెరిల్ మిచైల్, టామ్ టాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రేస్ వెల్ ఎల్బీడబ్ల్యూ అయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. టీం ఇండియా సారధి రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 11 పరుగులకే పెవిలియన్ బాట పట్టినా అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌లతో కలిసి శ్రేయాస్ అయ్యర్ జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులు, హార్దిక్ పాండ్యా 45 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు, క్యేల్ జామియాసన్, విల్ ఓ రూర్కే, మిచెల్ శాంత్నర్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.