ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై తమకు ఎదురులేదని భారత క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన 280 పరుగులతో విజయదుందుభి మోగించింది. 515 పరుగుల ఛేదనలో బంగ్లా 234 పరుగులకే పోరాటాన్ని చాలించింది. ఆట మొదటి రోజు రెండు సెషన్లలో తడబడ్డా లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత శతకానికి తోడు రవీంద్ర జడేజా నిలకడైన బ్యాటింగ్‌తో భారీ స్కోరు సాధించిన టీమ్ఇండియా.. ఆ తర్వాత ఎక్కడా ఆధిక్యాన్ని కోల్పోకుండా ఆధిపత్యం చెలాయించింది. నాలుగో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా పనిపట్టిందీ ఈ స్పిన్ ద్వయమే కావడం విశేషం. భారీ ఛేదనలో బంతి పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అంతంత మాత్రంగానే అనుకూలించినా స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న అశ్విన్.. ఆరు వికెట్లతో విజృంభించి బంగ్లాను చావుదెబ్బ కొట్టాడు. జడ్డూ కూడా తన స్పిన్ మాయతో ప్రత్యర్థి ఆట కట్టించడంతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
Team India | చెన్నై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ భారీ విజయం సొంతం చేసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి (6/88)తో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లా పనిపట్టాడు. అశ్విన్‌కు తోడు అతడి సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/58) రాణించడంతో 515 పరుగుల ఛేదనలో పర్యాటక జట్టు 234 పరుగులకే ఆలౌట్ అయి భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. భారీ ఛేదనలో ఆ జట్టు సారథి నజ్ముల్ హోసేన్ శాంతో (82) పోరాడినా అతడికి అండగా నిలిచేవారు కరువవడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో తో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సిరీస్‌లో రెండో టెస్టు ఈనెల 27 నుంచి కాన్పూర్ వేదికగా జరుగనుంది.
కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో ఓవర్ నైట్ స్కోరు 158/4 వద్ద నాలుగో రోజు ఆటను ఆరంభించిన బంగ్లా కనీస పోరాటం లేకుండానే రెండు గంటల్లోపే తోకముడిచింది. తొలి గంటలో శాంతో, షకిబ్ (25) కొంతసపు వికెట్లను కాపాడుకునే దశలో మరీ నెమ్మదిగా ఆడారు. కానీ డ్రింక్స్ తర్వాత కెప్టెన్ రోహిత్.. బంతిని అశ్విన్‌కు అందించడంతో బంగ్లా ‘ఖేల్’ ఖతం అయింది. అశ్విన్, జడ్డూ కలిసి 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. అశ్విన్ తన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 52వ)లోనే షకిబ్‌ను పెవిలియన్‌కు పంపాడు. స్లిప్స్‌లో యశస్వీ అద్భుత డైవ్ క్యాచ్ పట్టడంతో 48 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత వచ్చినోళ్లెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. జడ్డూ బౌలింగ్‌లో లిటన్ దాస్ (1) రోహిత్‌కు క్యాచ్ ఇవ్వగా బంగ్లా భారీ ఆశలు పెట్టుకున్న మెహిది హసన్ మిరాజ్ (8)ను అశ్విన్ ఔట్ చేసి రెండో ఇన్నింగ్స్‌లో ‘ఫైఫర్’ను పూర్తిచేసుకున్నాడు. జడేజా వేసిన 63వ ఓవర్లో హసన్ మహ్ముద్ (7) క్లీన్ బౌల్డ్ అవడంతో బంగ్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరిగే రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులేమీ లేవు. తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టు సభ్యులనే రెండో టెస్టులోనూ కొనసాగిస్తున్నట్టు ఆదివారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్
భారత్: తొలి ఇన్నింగ్స్ – 376 ఆలౌట్,
బంగ్లాదేశ్: తొలి ఇన్నింగ్స్ – 149 ఆలౌట్,
భారత్: రెండో ఇన్నింగ్స్ – 287/4 డిక్లేర్డ్.
బంగ్లాదేశ్: రెండో ఇన్నింగ్స్ – 234 ఆలౌట్
రెండుసార్లూ ఒకే వేదికపై (టెస్టులలో) సెంచరీ చేసి ఐదు వికెట్లు తీసిన మొదటి ఆటగాడు. 2021లో ఇంగ్లండ్‌తో టెస్టులోనూ అతడు ఈ ఘనత సాధించాడు. అదీగాక ఒక టెస్టులో శతకంతో పాటు‘ ఫైఫర్’ సాధించిన ఆటగాళ్లలో ఇయాన్ బోథమ్ (5) తర్వాత రెండో స్థానంలో అశ్విన్ (4) నిలిచాడు.
టెస్టులలో అత్యధిక సార్లు (37) ఐదు వికెట్ల ఘనత సాధించిన రెండో బౌలర్. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (67) అందరికంటే ముందున్నాడు. ఈ క్రమంలో అతడు దివంగత షేన్ వార్న్ (37- ఆసీస్), రిచర్డ్ హ్యాడ్లీ (36- కివీస్)ను దాటేశాడు.
టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ స్థానం. 522 వికెట్లతో అతడు 8వ స్థానంలో నిలిచాడు. విండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్ (519)ను అధిగమించాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు విజయం అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 92 ఏండ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా 580 టెస్టులు ఆడగా తొలిసారి ఓటముల కంటే విజయాల సంఖ్యను ఎక్కువగా నమోదుచేసింది. 580 టెస్టులలో 179 విజయాలు, 178 ఓటములు, 222 డ్రాలు చేసుకోగా ఒక మ్యాచ్ టై అయింది. ప్రపంచ క్రికెట్లో ఇలా అపజయాల కంటే విజయాలు ఎక్కువ నమోదుచేసిన దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.