టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతోంది. వీటిలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ సోమవారం నాడు జరిగింది. వెస్ట్ ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించగా.. మరికొందరు పేలవ ప్రదర్శన చేశారు. మ్యాచ్ గెలిచినప్పటికీ భారత జట్టులోని లోపాలు మరోసారి తేటతెల్లం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో విజయం కన్నా బౌన్సీ పిచ్‌లపై భారత ఆటగాళ్లు ఎలా ఆడతారన్నదానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలి.
ముఖ్యంగా జట్టులో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఆస్ట్రేలియా వెళ్లారు. అందుకే వెటరన్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతినిచ్చిన టీం మేనేజ్మెంట్.. యువఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. వారి ప్రదర్శనను అంచనా వేసి ప్రపంచకప్‌లో ఆడే 11 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. మరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎవరెలా రాణించారో ఒకసారి చూస్తే..
రాహుల్‌కు విశ్రాంతినివ్వడంతో ఓపెనర్‌గా వచ్చిన పంత్ మరోసారి నిరాశపరిచాడు. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటలేడని వస్తున్న విమర్శలను ఏమాత్రం తిప్పికొట్టలేకపోయాడు. ఏకంగా 17 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులే చేసి అవుటయ్యాడు.
రాహుల్, కోహ్లీ వంటి వెటరన్లు లేని సమయంలో జట్టును ముందుండి నడిపించాల్సిన రోహిత్.. మరోసారి ఎడంచేతి వాటం పేసర్‌కు వికెట్ పారేసుకున్నాడు. జేసన్ బెహ్రెండాఫ్ వేసిన ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 3 పరుగులే చేశాడు.
వెన్నునొప్పితో సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన దీపక్ హుడా.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. కోహ్లీ స్థానంలో మూడో నెంబర్ ఆటగాడిగా వచ్చిన అతను.. 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
తొలిసారిగా భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన వారిలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకడు. అయితే కొత్త పిచ్‌లపై ఎలాంటి తడబాటు లేకుండా ఆడిన అతను.. తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 52 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేయకపోయినా బ్యాటుతో అలరించాడు హార్దిక్ పాండ్యా. వేగంగా ఆడుతూ ధనాధన్ ఆటతో 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫీల్డింగ్ సమయంలో కూడా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే అది నోబాల్ కావడంతో బ్యాటర్ బతికిపోయాడు.
ఫినిషర్‌గా జట్టులో చేరిన ఈ వెటరన్ ఆటగాడు.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరవలేదు. అయితే 19 పరుగులతో అజేయంగా నిలిచి, భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కృషి చేశాడు.
ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్.. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న శామ్ ఫానింగ్ (58)ను అవుట్ చేశాడు.
డెత్ బౌలింగ్ ఎక్స్‌పర్ట్‌గా జట్టులో ఉన్న హర్షల్.. తన పేలవ ప్రదర్శనను కంటిన్యూ చేశాడు. కేవలం ఒక్క వికెట్ తీసుకున్న అతను.. చివరి ఓవర్లో ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ సీనియర్ పేసర్ మరోసారి తన విలువను చాటుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డీఆర్కీ షాట్‌ను పెవిలియన్ చేర్చి, భారత బౌలింగ్ దళానికి మంచి ఆరంభం అందించాడు. ఈ మ్యాచ్‌లో భువీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని అంతా అనుకుంటున్న అక్షర్ పటేల్.. బ్యాటింగ్‌లో ఒక భారీ సిక్సర్ కొట్టాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మధ్య కాలంలో వికెట్లు తీసుకోలేక తడబడుతున్న చాహల్.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు.