ఓల్డ్ట్రాఫొర్డ్: లార్డ్స్ టెస్టులో గాయపడ్డ టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. మాంచెస్టర్ వేదికగా ఈనెల 23 నుంచి మొదలుకాబోయే టెస్టులో ఆడకపోవడమే ఉత్తమమని భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. మూడో టెస్టు తొలిరోజు కీపింగ్ చేస్తుండగా పంత్ ఎడమచేతి చూపుడు వేలికి గాయమవడంతో జురెల్ వికెట్ల వెనుక విధులు నిర్వర్తించాడు. పంత్ కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు.
గాయం తీవ్రత గురించి ఇంకా పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ పంత్ నాలుగో టెస్టులోనూ ప్యూర్ బ్యాటర్‌గా కొనసాగుతాడని భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటె రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించాడు. దీనిపై శాస్త్రి మాట్లాడుతూ.. ‘పంత్ చేతి వేలికి గాయమైంది. అతడు వికెట్ కీపింగ్ చేస్తే గ్లవ్స్‌తో ఎంతోకొంత రక్షణ ఉంటుంది గానీ ఫీల్డింగ్ చేసేప్పుడు వేలికి ఏమైనా అయితే అప్పుడది మరింత ప్రమాదకరం. ఒకవేళ పంత్ నాలుగో టెస్టు ఆడితే బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయాలి. లేదంటే విరామం తీసుకుని పూర్తిగా కోలుకున్నాకే ఐదో టెస్టు ఆడాలి’ అని అన్నాడు.