న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు ఈనెల 15న బయల్దేరి వెళ్లనుంది. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఈ నెల 19వ తేదీ నుంచి మొదలుకానుండగా, 15న రెండు బ్యాచ్‌లుగా టీమ్ఇండియా క్రికెటర్లు ప్రయా ణం కానున్నారు. బిజినెస్ క్లాస్ టికెట్ల అందుబాటును దృష్టిలో పెట్టుకుని క్రికెటర్లు వెళ్లే అవకాశముందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. కంగారూలతో వన్డే సిరీస్‌కు ఎంపికైన రోహిత్‌శర్మతో పాటు వైస్‌కెప్టెన్‌గా ప్రమోట్ అయిన శ్రేయాస్ అయ్యర్, విరాట్‌కోహ్లీ మరి కొంత మంది క్రికెటర్లు తొలి వన్డేకు వేదికైన పెర్త్‌కు వెళ్లనున్నారు. 2027 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకున్న సెలెక్టర్లు రోహిత్‌శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ శుభ్మన్గిల్కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో మూడు వన్డేలు ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలుకానుంది.
టీమ్ఇండియాకు గంభీర్ డిన్నర్:
టీమ్ఇండియా క్రికెటర్లకు చీఫ్ కోచ్ గౌతం గంభీర్ బుధవారం డిన్నర్ ఇచ్చాడు. విండీస్‌తో రెండో టెస్టుకు ముందు ఢిల్లీలోని రాజిందర్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో ప్లేయర్లకు ఆతిథ్యమిచ్చాడు. ఆసీస్ పర్యటనకు ముందు క్రికెటర్లంతా గంభీర్ నివాసంలో కలుసుకుని సందడి చేశారు.