Kapil Dev | టీమిండియా రెండు తరాల క్రికెటర్లను పోల్చి చూడలేమని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఇంగ్లాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సైతం స్పందించేందుకు నిరాకరించారు. 1991-92లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కపిల్ దాదాపు 300 ఓవర్లు బౌలింగ్ చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో 400 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు సెకండ్ ఇన్నింగ్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో బుమ్రా 150 ఓవర్లకుపైగా 32 వికెట్లు పడగొట్టాడు. రెండు తరాల మధ్య పోలిక ఉండకూడదని.. దాంతో అవసరం లేదన్నారు. ప్రస్తుత కాలంలో ఆటగాళ్లు రోజునే 300 పరుగులు చేస్తున్నారని.. ఇది తమకాలంలో జరుగలేదని.. దాంతో రెండు తరాల ఆటగాళ్ల మధ్య పోలిక సాధ్యం కాదన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ఫామ్‌తో విమర్శల పాలవుతున్న కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ భవితవ్యంపై ఊహాగానాలున్నాయి.
ఇద్దరూ సీనియర్లని.. వారి భవిష్యత్‌ను వారే నిర్ణయించుకోగలరని మాజీ కెప్టెన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో తొమ్మిది ఇన్నింగ్స్‌లో కోహ్లీ 190 పరుగులు చేయగలిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల బంతిని వెంటాడుతూ పదేపదే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. మూడు మ్యాచుల్లో ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 31 పరుగులు చేశాడు. దాంతో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ఎవరు రేసులో ఉంటారన్న ప్రశ్నకు సమాధానాలిచ్చారు. ఇందులో ఎలాంటి వివాదాలు ఉండకూడదని.. కెప్టెన్ ఎవరూ అయినా పూర్తి సమయం తీసుకోవాలన్నారు. ఇంగ్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో యశస్వి, పంత్ వంటి డాషింగ్ బ్యాట్స్మెన్లకు చోటు కల్పించకపోవడంపై స్పందిస్తూ.. మరొకరి నిర్ణయంపై తాను ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. సెలెక్టర్లు కొంత ఆలోచించిన తర్వాతే జట్టును ఎంపిక చేశారని.. తాను ఏదైనా చెబితే వారిని విమర్శించడమే అవుతుందని.. తాను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదని మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ చెప్పుకొచ్చారు.