నాలుగో స్థానంలో సరైన ప్లేయర్ దొరకడం లేదు?
అంత ఇబ్బంది ఎందుకు అతడున్నాడుగా..
పార్ట్నర్షిప్ బ్రేక్ చేసే బౌలరే కరువయ్యాడు?
ఏం పర్వాలేదు.. అతడికి బంతినిస్తే చాలు..
ఓపెనర్లు విఫలమయ్యారు ఇన్నింగ్స్‌ను నిలబెట్టేదెవరో?
దిగులు పడాల్సిన పనిలేదు అతడు చూసుకుంటాడు..
భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి.. ధాటిగా ఆడేవారెవరో?
ఆందోళన అక్కర్లేదు గేర్ మార్చితే దుమ్మురేపుతాడు..
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే లెక్క అన్నట్లు.. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్‌లోనే తెలుగోడు జెండా పాతేశాడు. దేశవాళీల్లో పరుగుల వరద పారించి 20 ఏండ్ల వయసులోనే టీమిండియా తలుపుతట్టిన ఆ హైదరాబాదీ కుర్రాడే నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. ఆడిన తొలి సిరీస్‌లోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న తిలక్.. ఇప్పుడు భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. నెల రోజుల క్రితం వరకు ఎక్కువ మందికి తెలియని అతడి పేరు.. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో తిలక్‌కు చోటివ్వాల్సిందే అనే స్థాయికి చేరుకుందంటే.. తెలంగాణ కుర్రాడి ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు! తొలి సిరీస్‌లోనే వయసుకు మించిన పరిణతి కనబర్చిన తిలక్ వర్మపై ప్రత్యేక కథనం..
నాలుక మడతేసి కొట్టాడంటే బంతి బౌండ్రీ దాటాల్సిందే! బౌలింగ్ చేస్తున్నది పేస్ బౌలరా, స్పిన్నరా అనే దాంతో పని లేదు. పిచ్ పరిస్థితులు జాన్తానై! జట్టుకు అవసరముందంటే చాలు ఎలాంటి బాధ్యతైనా భూజానెత్తుకునేందుకు నేను సిద్ధమే అని తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ నిరూపించాడు. దేశవాళీలతో పాటు గత రెండు ఐపీఎల్ సీజన్లలో నిలకడగా రాణించిన తిలక్.. వెస్టిండీస్ పర్యటనకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకోగా.. టూర్ ముగిసేసరికి అంతా అతడి గురించే చర్చించుకునేలా చేశాడు. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ప్రయోగాలు చేసేందుకు టీమ్ఇండియా ఈ పర్యటనను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు ఇచ్చింది. అవకాశాలను అందిపుచ్చుకున్నవాళ్లే గొప్ప ప్లేయర్లు అవుతారని బలంగా నమ్మిన తిలక్.. తనకు వచ్చిన చాన్స్‌ను రెండు చేతులతో ఒడిసి పట్టాడు. భారత జట్టు తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ హైదరాబాదీ.. అవసరమైతే యాంకర్ రోల్ పోషిస్తూ ఇన్నింగ్స్‌ను నడపగలనని రెండో మ్యాచ్‌లో నిరూపించుకున్నాడు. ఇక మూడో మ్యాచ్‌లో అర్ధశతకానికి ఒక పరుగు దూరంలో అజేయంగా నిలిచినా ఏమాత్రం నిరాశ చెందకుండా తాను టీమ్ ప్లేయర్‌నని చాటి చెప్పాడు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఖాయమే అనుకున్న అయ్యర్ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో.. విండీస్ పర్యటన ద్వారా ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవాలనుకున్న మేనేజ్మెంట్ నిరాశే ఎదురైంది. వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, శాంసన్‌ను ప్రయత్నించినా.. ఈ ఇద్దరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి చేరగా.. టీ20ల్లో మాత్రం ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన తిలక్‌వర్మ సూపర్ అనిపించుకున్నాడు. మరీ ముఖ్యంగా హైదరాబాదీలకే సొంతమైన క్లాసికల్ గేమ్‌తో తిలక్ అభిమానులతో పాటు మాజీలను కట్టిపడేశాడు. దీంతో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లకు తిలక్‌ను ఎంపిక చేయాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతున్నది.
ఒకప్పుడు భారత జట్టులో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ ఇలా అవసరమైతే బౌలింగ్‌లోనూ ఒక చేయి వేయగల వాళ్లు చాలా మంది ఉండేవారు. ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయినట్లు కనిపిస్తే.. కెప్టెన్లు వెంటనే పార్ట్ టైమర్లకు బంతినిచ్చేవారు. ఇలా బౌలింగ్ చేసిన మాస్టర్ జట్టుకు ఎన్నోసార్లు బ్రేక్ త్రూ అందించాడు. ప్రస్తుత టీమ్ఇండియాను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. ఇలా వీళ్లంతా కేవలం బ్యాటర్లే. వీళ్లలో ఏ ఒక్కరూ కనీసం ఒకటీ రెండు ఓవర్లు కూడా వేయలేకపోతుండటంతో బౌలర్లపై అదనపు భారం పడుతున్న మాట వాస్తవం. అయితే తాజాగా విండీస్‌తో చివరి టీ20లో తనలో బౌలింగ్ చేసే సత్తాతో పాటు.. బ్రేక్ త్రూలు ఇప్పించగల నైపుణ్యం ఉందని తిలక్ నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రెండో బంతికే వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక తొలి మ్యాచ్‌లోనే రెండు క్యాచ్‌లు అందుకున్న తిలక్.. బౌండ్రీలైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్‌తో ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలనని రుజువు చేసుకున్నాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభ గల ప్లేయర్‌ను కీలక టోర్నీల్లో వాడుకుంటారా.. లేక పక్కన పెడతారా అనేది త్వరలోనే తేలనుంది.
అవకాశాలను వినియోగించుకోవడంలో విఫలమైన శాంసన్ దాదాపు ప్రపంచకప్ పోటీ నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుండగా.. రిజర్వ్ ఓపెనర్‌గా ఇషాన్‌కు చోటు దక్కడం ఖాయమే. మిడిలార్డర్లో శ్రేయస్, రాహుల్ అందుబాటులో లేకపోతే సూర్యకుమార్‌తో పాటు తిలక్‌వర్మను తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. భారత జట్టులో ఒకటి నుంచి ఆరో స్థానం వరకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం. కేవలం భారీ షాట్లు ఆడటమేగాక.. అవసరమైనప్పుడు సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసే సత్తా ఉన్న తిలక్ మిడిలార్డర్లో గెలుపు గుర్రమవుతాడనే విశ్లేషిస్తున్నారు. వన్‌డౌన్‌లో కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ ఉండటంతో అవసరమైన సమయంలో గేర్లు మార్చగల తిలక్‌ను నాలుగో స్థానంలో కొనసాగిస్తే.. మెగాటోర్నీలో టీమిండియా కష్టాలు తీరినట్లేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.