‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అయ్యింది. కుప్పకూలిపోవడం జరిగింది. లక్ష కోట్లు ఆవిరైనయ్. బరాజ్‌లు పనికే రావు’
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (జనవరి 2024)
‘కాళేశ్వరం బరాజ్లన్నిటికీ రిపేర్లు చేయిస్తం. ఆ పనుల నిర్వహణను ఇప్పటికే ఏజెన్సీలకు అప్పగించినం. కాళేశ్వరం కాంపొనెంట్లన్నింటినీ వినియోగించుకుంటం’
– 2026, ఫిబ్రవరి 22న దేవాదుల వద్ద సీఎం రేవంత్
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్ట రాజకీయం మరోసారి బట్టబయలైంది. ‘ప్రాజెక్టు కుప్పకూలింది.. లక్షకోట్లు వృథా’ అంటూ ఇప్పటివరకు చేసిన ప్రచారమంతా వట్టిదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా అంగీకరించారు. నిన్నటి వరకు నిరర్థకమన్న ప్రాజెక్టులో కాంపొనెంట్లనే ఇప్పుడు వినియోగించుకుంటామని తాజాగా ప్రకటించారు. ప్రాజెక్టుపై చేసిన ప్రచారమంతా అసత్యమని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రభుత్వం అంగీకరించగా, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే నిర్ధారించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రాజెక్టును రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పడావుపెట్టినట్టుగా తేలిపోయింది.
మేడిగడ్డ బరాజ్‌లో మొత్తం 8 బ్లాక్‌లున్నాయి. అందులో 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. కారణాలను అన్వేషించేందుకు ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీ, ఐఐటీ రూర్కీ సంస్థ కూడా అధ్యయనం చేసింది. సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. 7వ బ్లాక్‌లోనే కాకుండా బరాజ్‌లోని అన్ని బ్లాకుల్లోనూ సాంకేతిక పరీక్షలు పూర్తి చేశారు. 7వ బ్లాక్ మినహా అన్నీ భద్రంగానే ఉన్నాయని పరీక్షల్లో తేలింది. 7వ బ్లాక్‌లోనూ రాఫ్ట్ వద్ద 20వ పిల్లర్ కింద మినహా మరేచోటా ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని గతంలోనే నిర్ధారించారు. భౌగోళిక అధ్యయనాల్లో తేలిన అంశం ఏమిటంటే బరాజ్ దెబ్బతిన్న బ్లాక్ 7 పునాది కింద అంతర్గత జల ప్రవాహంతో బరాజ్ ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక, మట్టి కోతకు గురై, తద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగింది.
బరాజ్‌లో మరేచోటా సాంకేతిక లోపాలు లేవని నివేదికలో తేల్చారు. 7వ బ్లాక్‌కు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవచ్చని ఇంజినీర్లు సైతం స్పష్టం చేశారు. జాతీయ సంస్థలతోనూ పరీక్షలు చేయించారు. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) బృందం కూడా ఇంచుమించు ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ముందస్తుగా రక్షణ చర్యల్లో భాగంగా అన్ని బరాజ్‌లలోనూ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. మేడిగడ్డ బరాజ్‌ను వినియోగంలోకి తేవచ్చని కూడా ఎన్డీఎస్ఏ వెల్లడించింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం రెండేండ్లుగా పునరుద్ధరణ చేపట్టకుండా ప్రాజెక్టును పడావు పెట్టింది.
మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపుతూ మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజమని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకున్నది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూడా కూలిపోతాయం టూ విషం చిమ్మింది. అధికారంలో వచ్చిన వెంటనే బరాజ్‌లను మరమ్మతు చేయడం మాని కేవలం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ను బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా బరాజ్‌లను సందర్శించి లక్ష కోట్లు వృథా అంటూ ప్ర చారం చేశారు. అసెంబ్లీ వేదికగా అబద్ధపు ప్ర చారానికి శ్రీకారం చుట్టారు. నీటిని ఎత్తిపోయ డం నిలిపివేశారు.
యాసంగిలో ప్రాజెక్టు పరిధిలోని లక్షలాది ఎకరాలు సాగునీరు అందక ఎండిపోతున్నా కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చింది. విజిలెన్స్, కాళేశ్వరం కమిషన్ విచారణ పేరిట పబ్బం గడుపుకొన్న ది. ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ బరాజ్ మరమ్మతులను అటకెక్కించింది. ఆచరణలో అడుగడుగునా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కాంపొనెంట్లే ఆధారంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తరలిస్తామని ప్రకటించింది.
ఆ తర్వాత ప్రాణహిత- చేవెళ్ల ప్రా జెక్టు లింకును తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్ నుంచే చేపడుతామని చె ప్పింది. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. ఓవైపు ప్రాజెక్టు నిరర్థకమంటూ, లక్షకోట్లు వృథా అంటూ మరోవైపు అందుకు విరుద్ధం గా వ్యవహరిస్తున్నది. తాజాగా మేడిగడ్డ బరాజ్‌ను సైతం పునరుద్ధరించి, వినియోగించుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ప్రాజెక్టుపై ఇప్పటివరకు చే సిన ప్రచారమంతా వట్టిదేనని స్వయంగా అం గీకరించారు. ఇదిలా ఉంటే ప్రాజెక్టు మరమ్మతులను ప్రారంభించి ఉంటే ఇప్పటికే పనులు పూర్తయి, వినియోగంలోకి కూడా వచ్చి ఉండేవని నీటిరంగ నిపుణులు తేల్చిచెప్తున్నారు.