కరీంనగర్ ముకరంపుర, ఆగస్టు 6 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు సమీపంలో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చేపట్టిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు జలమయమైంది. చిన్న పాటి వర్షానికే వరద ప్రవాహం చుట్టు ముట్టింది. స్విచ్ యార్డులోనూ సుమారు రెండున్నర అడుగుల వరకు నీరు నిలిచి ఉండడంతో ముందు జాగ్రత్తగా ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు ఐదెకరాల్లో ప్రహరీ నిర్మించి, 1.4 మెగా వాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు.
ప్యానెళ్లను అమర్చి, ఉత్పత్తయిన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా సమీపంలోని సబ్ స్టేషన్‌కు ప్రత్యేక లైన్లను అనుసంధానించారు. వాస్తవానికి సోలార్ ప్లాంట్ ఉన్న ప్రాంతమంతా లోతట్టు ఏరియా, పూర్తిగా నల్ల రేగడి భూమి కావడంతో చిన్న పాటి వర్షానికే రోజుల తరబడి నీళ్లు నిలిచి ఉంటున్నాయి. ఇటీవలి వర్షాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకాగా, మూడు రోజులుగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దాదాపు 15వేల యూనిట్ల ఉత్తత్పి నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి ప్యానెళ్ల ఏర్పాటుకు ముందు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ప్లాంట్ జలమయం కావడానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.