Team India | ఈ నెల చివరి నుంచి శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టుతో చేరింది. జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రై సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నది. ఈ ముక్కోణపు వన్డే సిరీస్ ఏప్రిల్ 27న మొదలుకానున్నది. చివరి మ్యాచ్ మే 11న జరుగుతుంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో ఆడుతుంది. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. భారత జట్టు ఏప్రిల్ 27న శ్రీలంకతో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. మూడు జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అన్ని మ్యాచులు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరుగన్నాయి. ఫాస్ట్ బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు గాయపడ్డారు. దాంతో వారిని ఎంపిక చేయలేదు. కశ్వి గౌతమ్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్‌కి జట్టులో చోటు దక్కింది. ఈ ముగ్గురికి తొలిసారిగా జాతీయ జట్టులోకి చోటు దక్కింది.
జాతీయ జట్టులోకి తొలిసారిగా ముగ్గురు యువ ప్లేయర్స్‌కు చోటు దక్కింది. 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ కశ్వి గౌతమ్ తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికైంది. ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించడంతో ట్రై సిరీస్‌కు ఎంపిక చేశారు. టోర్నమెంట్లో తొమ్మిది మ్యాచ్‌ల్లో మొత్తం 11 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో తొలిసారి భారత జట్టులో ఛాన్స్ ఆడే అవకాశం దక్కింది. 20 ఏళ్ల శ్రీ చరణి ఎడమచేతి వాటం స్పిన్నర్. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆమె రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీసింది. మరో ఎడమచేతి వాటం స్పిన్నర్ శుచి సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్. ఆమె తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 3.48 ఎకానమీ రేటుతో 18 వికెట్లు పడగొట్టింది. ఆమె ప్రాతినిథ్యం వహించిన మధ్యప్రదేశ్ జట్టు ట్రోఫీని గెలిచింది. శుచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది.
భారత్ ఐర్లాండ్‌తో జరిగిన చివరి వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ ఈ సిరీస్‌కు దూరమైంది. ఆమె గైర్హాజరీలో స్మృతి మంధాన కెప్టెన్‌గా, దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించింది. డిసెంబర్ 2024లో వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ సమయంలో హర్మన్‌ప్రీత్ మోకాలి గాయంతో ఇబ్బందిపడింది. అంతకుముందు 2024 అక్టోబర్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెడకు గాయమైన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ గత నెలలో మహిళల ప్రీమియర్ లీగ్‌తో మళ్లీ మైదానంలోకి వచ్చింది. ఆమె నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ రేణుకకు కూడా విశ్రాంతి ఇచ్చారు. డిసెంబర్ 2024లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో ఆమె మూడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టింది. ఆమె కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతోంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి కౌర్, అమన్‌జోత్ కౌర్, కాశ్వి గౌతమ్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసాబినీస్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ.