Rahul Dravid : భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. వెస్టిండీస్ పర్యటన(Westindies Tour) తర్వాత అతడితో పాటు టీమిండియా సహాయక బృందం బ్రేక్ తీసుకోనుంది. దాంతో, ఐర్లాండ్ సిరీస్(Ireland Series)లో భారత జట్టు ద్రవిడ్ లేకుండానే బరిలోకి దిగనుంది. అతడి గైర్హాజరీలో నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఈ సిరీస్ బాధ్యతలు చూసుకోనున్నాడు.
ఈ సమయంలో ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్(Vikram Rathour), బౌలింగ్ కోచ్ పరాస్(Paras Mhambrey) హంబ్రే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వీళ్లు తిరిగి ఆగస్టులో భారత్కు రానున్నారు.
ద్రవిడ్, సహాయ సిబ్బందికి రెస్ట్ ఇవ్వడానికి కారణం ఉంది. అదేంటంటే..? త్వరలోనే శ్రీలంక, పాక్ గడ్డపై ఆగస్టు 31 నుంచి ఆసియా కప్(Asia Cup 2023) టోర్నమెంట్ జరుగనుంది. ఆలోపు ద్రవిడ్ అండ్ కో మరింత చురుకుగా, హుషారుగా ఉండాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) వంటి ముఖ్యమైన టోర్నీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ద్రవిడ్ బృందంపై పని ఒత్తిడి పడకుండా కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంది.
విక్రమ్ రాథోర్, రాహుల్ ద్రవిడ్
దాంతో, ఐర్లాండ్ సిరీస్లో వీవీఎస్ లక్ష్మణ్ అన్నీ తానై వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్లో హృషికేశ్ కనిట్కర్(Hrishikesh Kanitkar) బ్యాటింగ్ కోచ్గా..ట్రాయ్ కూలి(Troy Cooley), సాయిరాజ్ బహుతులే( Sairaj Bahutule) బౌలింగ్ కోచ్గా సేవలందించనున్నారు. ఐర్లాండ్ పర్యటనతో భారత జట్టు మూడు టీ20లు ఆడనుంది. ఆగస్ట్ 18న ఇరుజట్లు తొలి టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి. అయితే.. ఈ సిరీస్కు సెలెక్టర్లు ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉంది.