Team India | 1983లో భారత జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ నెగ్గిన తర్వాత సరిగ్గా 20 ఏండ్లకు.. టీమ్ఇండియా రెండోసారి ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వన్డే ప్రపంచకప్‌లో భారత్ అద్వితీయ ఆటతీరు కనబర్చింది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిన గంగూలీ సారథ్యంలోని టీమ్ఇండియా.. సూపర్ సిక్స్‌లో అన్నీ విజయాలు సాధించి తుదిపోరుకు చేరింది. అయితే ఫైనల్లో కంగారూల ఊచకోత ముందు ఎదురు నిలువలేకపోయిన భారత్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గంగూలీ కెప్టెన్సీలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్‌తో కూడిన భారత జట్టు ఆ టోర్నీలో ఓడిన రెండు మ్యాచ్‌లు ఆస్ట్రేలియా చేతిలోనే కావడం గమనార్హం.
లీగ్ దశలో మరీ ఘోరంగా 125 పరుగులకే కుప్పకూలి భారీ ఓటమి మూటగట్టుకున్న టీమ్ఇండియా.. ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గి ఫైనల్లో మరోసారి ఆస్ట్రేలియాను ఢీకొట్టింది. ఈ సారైనా ఫలితం మారుతుందేమో అనుకుంటే.. నాకౌట్ మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన కంగారూలు.. భారత బ్యాటింగ్ ప్రారంభం కాకముందే మ్యాచ్‌ను లాగేసుకున్నారు. లీగ్ దశతో పోల్చుకుంటే.. మరింత బలంగా కనిపించిన టీమ్ఇండియా కనీస పోటీ కూడా ఇవ్వలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టాస్ గెలిచిన గంగూలీ.. ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించగా.. కెప్టెన్ రికీ పాంటింగ్ మెరుపు శతకానికి.. గిల్‌క్రిస్ట్, హెడెన్, మార్టీన్ మెరుపులు తోడవడంతో ఆసీస్ 359/2తో నిలిచింది.
కొండంత లక్ష్యఛేదనలో భారీ అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన సిచన్ టెండూల్కర్ తొలి ఓవర్లోనే ఔట్ కావడంతో.. ఇక ఏ దశలోనూ భారత్ పోటీలో నిలువలేకపోయింది. ఆ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితా అగ్రస్థానంలో నిలిచిన మాస్టర్ బ్లాస్టర్.. తొలి ఓవర్ ఐదో బంతికి మెక్‌గ్రాత్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. ఆ తర్వాత సెహ్వాగ్ పోరాటంతో టీమ్ఇండియా చివరకు 39.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై 125 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునే అవకాశం టీమ్ఇండియాకు వచ్చింది. మళ్లీ 20 ఏండ్ల తర్వాత భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఈ సారి టీమ్ఇండియాదే విజయం అని అభిమానులు ధీమాగా ఉన్నారు.