Sreesanth | భారత తృతీయ స్థాయి జట్టు కూడా.. పాకిస్థాన్ భరతం పట్టగలదని.. టీమ్ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోతోందని.. భారత ఆటగాళ్లు అందులో ఆరితేరారని శ్రీశాంత్ పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ జట్టుకు ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం వహించని యువ ఆటగాళ్లతో కూడిన భారత-‘సి’ జట్టు కూడా పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగలదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ఆడిన కుర్రాళ్లు కూడా పాక్‌ను ఓడించగలరని శ్రీశాంత్ అన్నాడు.
ఇటీవలి కాలంలో భారత జట్టు ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతుండటంతో కొన్నిసార్లు రెండు జట్లను ఎంపిక చేయాల్సిన అవసరం కూడా పడుతోంది. నిరుడు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా తొలిసారి భారత్ ఇలా రెండు జట్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఇలా ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ.. ద్వితీయ శ్రేణీ ప్లేయర్లకు అవకాశం కల్పిస్తూ జట్లను ఎంపిక చేయడం పరిపాటిగా మారింది. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐర్లాండ్ టూర్‌కు టీమ్ఇండియా ఇలాంటి ప్లానే ఫాలో చేసింది. జస్ప్రీత్ బుమ్రాను సారథిగా ఎంపిక చేసి యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయగా.. వాళ్లు 2-0తో సిరీస్ పట్టిన విషయం తెలిసిందే.
శ్రీశాంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వాటిలో పెద్దగా అతిశయోక్తి లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల రోహిత శర్మ నేతృత్వంలోని ప్రధాన జట్టు వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో ఉంటే.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో యువ భారత జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. భారత్‌లో నైపుణ్యానికి లోటు లేదని.. ఏక కాలంలో మూడు జట్లను వేర్వేరుగా తయారు చేసినా.. పాకిస్థాన్‌ను ఓడించడం పెద్ద కష్టం కాదని ఓ అభిమాని కామెంట్ చేశాడు.