WTC Rankings : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. నిన్నామొన్నటి వరకూ ర్యాంకిగ్స్‌లో వెనకాల ఉన్న జట్లు అద్భుత విజయాలతో ముందుకొచ్చేయడంతో భారత జట్టు (Team India)కు షాక్ తగిలింది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమంతో, ఆపై స్వదేశంలో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయడంతో మూడో స్థానంలో కొనసాగిన టీమిండియా ఇప్పుడు ఏకంగా ఆరో ర్యాంక్‌కు పడిపోయింది. రెండో టెస్టులో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఘన విజయంతో మూడో ర్యాంక్ కైవసం చేసుకుంది.
డబ్ల్యూటీసీలో వరుసగా రెండుసార్లు ఫైనల్ ఆడిన భారత్ హ్యాట్రిక్ ఆశలు ఆవిరవుతున్నాయి. ఈసారి ఎలాగైనా టెస్టు గదను పట్టేయాలనుకున్న టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్ గురవ్వడంతో మూడు నుంచి ఐదో స్థానంలో నిలిచింది. అయితే.. రెండో టెస్టులో శుక్రవారం వెస్టిండీస్‌ను 9 వికెట్లతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మూడో ర్యాంక్‌కు ఎగబాకగా.. గిల్ సేన ర్యాంకు ఆరుకు దిగజారింది.
New Zealand get their first win of this cycle, while West Indies remain winless after seven games pic.twitter.com/pyWkpAiUGB
— ESPNcricinfo (@ESPNcricinfo) December 12, 2025
ప్రస్తుతం స్వదేశంలో ఐదు విజయాలు సాధించిన ఆస్ట్రేలియా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత గడ్డపై సంచలన విజయంతో సిరీస్ గెలుపొందిన దక్షిణాఫ్రికా 36 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఈ ఏడాది తొలి విజయతో కివీస్ జట్టు మూడో ర్యాంక్ సొంతం చేసుకుంది. రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో శ్రీలంక నాలుగు, పాక్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. 2027 జూన్‌లో డబ్ల్యూటీసీ సైకిల్ మ్యాచ్‌లు పూర్తై ఫైనల్ బెర్తులు ఖరారు కానున్నాయి.
టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో ప్రతి విజయం ఫైనల్ అవకాశాల్ని మెరుగుపరుస్తుంది. అలానే ప్రతి ఓటమి ర్యాంక్‌ను తగ్గిస్తూ పోతోంది. ఇప్పుడు టీమిండియా రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది. డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో ఇంగ్లండ్ గడ్డసూ సిరీస్ సమం చేసి.. వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయడంతో మూడో ర్యాంక్‌లో నిలిచిన టీమిండియా అనూహ్యంగా ఆరుకు దిగజారింది. సఫారీల జోరుకు నిలువలేక ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో చిత్తుగా ఓడింది.
The World Test champions bossing it!
South Africa secure their second ever Test series triumph in India, winning 2-0 🏆 pic.twitter.com/dGgcm2de7R
— ESPNcricinfo (@ESPNcricinfo) November 26, 2025
నాలుగో ఇన్నింగ్స్‌లో తెంబ బవుమా సేన నిర్దేశించిన 124 పరుగుల ఛేదనలో అక్షర్ పటేల్(26) మినహా ఏ ఒక్కరూ కూడా క్రీజులో నిలబడకపోవడంతో ఆలౌటై ఘోర పరాభవం చవిచూసింది. పదమూడేళ్ల తర్వాత ఈడెన్స్‌లో విక్టరీ కొట్టిన దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లగా.. టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. గువాహటి(Guwahati) లోనూ చెత్త ఆటతో 408 పరుగుల తేడాతో ఓడడంతో ఐదో ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు న్యూజిలాండ్ మూడుకు చేరగా భారత్ ఆరో స్థానంతో ఉసూరుమనిపించింది.