Team India : వన్డే ప్రపంచ కప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు దీపావళి(Diwali) సంబురాల్లో పాల్గొంది. నీలం రంగు జెర్సీతో మైదానంలో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నజట్టు సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నెదర్లాండ్స్‌తో ఆదివారం(నవంబర్ 12) ఆఖరి లీగ్ మ్యాచ్ ఉన్నందున.. ఒక రోజు ముందుగానే బెంగళూరులోని టీమ్ హోటల్లో దీపావళి పండుగ చేసుకున్నారు.
We are #TeamIndia 🇮🇳 and we wish you and your loved ones a very Happy Diwali 🪔 pic.twitter.com/5oreVRDLAX
— BCCI (@BCCI) November 12, 2023
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)తో పాటు సహాయక సిబ్బంది సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. బీసీసీఐ వీడియో షేర్ చేసిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. జట్టు సభ్యులతో దిగిన ఫొటోను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(KL Rahul) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి ‘మాతో పాటు మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అనే క్యాప్షన్ పెట్టాడు.
From us to all of you, Happy Diwali 🪔❤️ pic.twitter.com/vXA8CiGt7A
— K L Rahul (@klrahul) November 11, 2023
పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా అదరగొడుతోంది. టాపార్డర్ బ్యాటర్ల జోరుకు బుమ్రా, షమీ, సిరాజ్ పేస్ త్రయం దూకుడు తోడవ్వడంతో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచుల్లో గెలుపొందిన రోహిత్ సేన బృందం ఆదివారం చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పసికూన నెదర్లాండ్స్ జట్టు పని పట్టనుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లన్నీ ఛేజ్‌మాస్టర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. సఫారీలపై 49వ శతకంతో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డు సమం చేసిన విరాట్.. 50వ వన్డే సెంచరీ కొట్టాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో భారత జట్టు నవంబర్ 15న ముంబైలోని వాంఖడేలో న్యూజిలాండ్‌ను ఢీకొననుంది.