‘సక్కనోడ నా బావ’ అంటూ యూట్యూబ్ బాటపట్టి, ‘బావో బంగారం’తో సోషల్ మీడియాను షేక్ చేసిందామె. ఇప్పుడేమో ‘పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డ’ నంటూ ఫోక్ ఇండస్ట్రీలో రికార్డ్ స్థాయి వ్యూస్ కొల్లగొట్టింది.అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ 2025లో పెద్దిరెడ్డి పాటతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది జానపద గాయని మమతా రమేశ్. తాను పాడిన ఈ పాట పల్లె, పట్నం అని తేడా లేకుండా అంతటా మార్మోగుతున్నది. తన గళంతో సరికొత్త పాటలను పరిచయం చేస్తూ, కోట్లమంది జానపద శ్రోతలను అలరిస్తున్న మమతా రమేశ్ ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
మాది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నానాజ్‌పూర్ గ్రామం. ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. ఇంట్లో నేనే చిన్నదాన్ని. డిగ్రీ వరకు చదువుకున్న నాకు చిన్నప్పటినుంచే పాటలు పాడటమంటే ఎంతో ఇష్టం. బడిలో నిర్వహించే కార్యక్రమాల్లో దేశభక్తి గీతాలు, సామాజిక గీతాలు పాడేదాన్ని. అలా పాటతో నాకు దోస్తీ కుదిరింది. గ్రామీణ వాతావరణంలో పుట్టిపెరగడం వల్ల సోషల్‌మీడియా ప్రభావం తక్కువుండేది.
అయినా ఎవరైనా ఒక్క అవకాశం ఇస్తే యూట్యూబ్‌లో పాడాలనే కోరిక ఉండేది. మా చిన్నప్పటి దోస్తు వాళ్ల అన్న కొత్తగ యూట్యూబ్ చానెల్ పెట్టిండని తెలిసింది. అందుల పాడేందుకు నాకొక్క అవకాశం ఇవ్వమని మా దోస్తే వాళ్ల అన్నను అడిగింది. ఆయన రాసిన పాటను నాకిచ్చి పాడమన్నాడు. నేను మంచిగ పాడటంతో రికార్డింగ్ స్టూడియోలో నాతోనే ఆ పాటను పాడించి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిండు. అలా 2022లో ‘సక్కనోడ నా బావ.. నన్ను హైదరాబాద్‌కు తీసుకుపోవా’ జానపదంతో సామాజిక మాధ్యమాల్లో నా పాటల ప్రస్థానం మొదలైంది. నా టాలెంట్‌ను గుర్తించి నాతో పాడించిన పోషన్నను ఎప్పటికీ మర్చిపోను.
మొదటి పాట తరువాత వనిత టీవీ నిర్వహించిన ‘సారంగదరియా’ పాటల కార్యక్రమంలో అవకాశం లభించింది. అందులో నేను ఫైనల్స్ వరకు వెళ్లి ఎలిమినేట్ అయ్యాను. ఆ షోకు న్యాయ నిర్ణేతగా వ్యహరించిన కాసర్ల శ్యామన్న చాలా ధైర్యమిచ్చిండు.‘నీ ప్రయాణం ఇంకా ఉంది చెల్లె. భవిష్యత్‌లో గొప్ప స్థాయిలో ఉంటావ’ని భరోసా ఇచ్చిండు. ఆ షో తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పటివరకు 150 వరకు జానపదాలు, 50 దాకా ఆధ్యాత్మిక పాటలు పాడిన. ఈ పాటలన్నీటిలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చిన పాటలు కొన్నే ఉన్నాయి. అందులో ‘బావో బంగారం’ పాటతో అందరికీ దగ్గరయ్యా! ఇటీవల వచ్చిన ‘పెద్దిరెడ్డి’ పాటతో పాపులర్ అయ్యాను. గతేడాది దూరదర్శన్‌లో నిర్వహించిన ‘ఆటా-పాట’ కార్యక్రమంలో పాల్గొని టైటిల్ గెలుచుకున్నా.
అన్నిపాటలు పాడినట్టే పెద్దిరెడ్డి పాట పాడిన. ఆ పాటలో అంత ఎమోషన్ ఉందని రిలీజ్ అయితే గానీ తెల్వలేదు. అక్టోబర్‌లో సాంగ్ రికార్డింగ్ చేస్తే నవంబర్ 28న ఫుల్ సాంగ్ రిలీజైంది. పాట పూర్తిగా విన్న తరువాత మా ఆయనను పట్టుకొని దుఃఖం ఆపుకోలేక గంటసేపు ఏడ్చిన. బుల్లెట్ బండి లక్ష్మణన్న రాసిన ఈ పాటలోని కొన్ని లిరిక్స్ నా జీవితానికి దగ్గరగా నిలిచాయి. మా నాన్న కూడా నా చిన్నతనంలో పట్ట గొలుసులు చేయిస్తే మురుసుకుంట ఏసుకున్నా. ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసిండు. డిసెంబర్లో వారం రోజులపాటు ఇండియాలో టాప్ వన్ సాంగ్‌గా ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రస్తుతం 50 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నది. ఈ పాట మంచి సక్సెస్‌ను సాధించడంతో నల్గొండ గద్దర్ నర్సన్న, బుర్ర సతీష్ లాంటి సీనియర్ గాయకులు ఫోన్‌చేసి ‘పాటకు ప్రాణం పోసినవ్ చెల్లె’ అని మెచ్చుకున్నారు. ఈ పాట వింటుంటే ఏడుపొస్తున్నదని ఎక్కడెక్కడినుంచో ఫోన్లు చేస్తున్నరు. ఈ పాట విడుదలైన తరువాత ఇప్పటివరకు 50కి పైగా పాటలు రికార్డింగ్ చేసినా కూడా పెద్దిరెడ్డి పాట మాత్రం మైండ్‌లో నుంచి పోవడం లేదు.

నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్లో సేల్స్‌గర్ల్‌గా పనిచేశాను. అక్కడే సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్న రమేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మూడేండ్ల మా ప్రేమాయణానికి ముగింపు పలికి పెద్దలను ఒప్పించి 2016లో తిరుపతి వెంకన్న సన్నిధిలో లగ్గం చేసుకున్నాం. నా ప్రతి పాటలో నా భర్త ప్రోత్సాహం ఉంది. నా ఇష్టాన్ని గుర్తించి వెన్నుతట్టిండు. వారమంతా కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూనే, ఆదివారం సెలవు రోజని ఇంటికాడ ఉండకుండా నన్ను రికార్డింగ్ స్టూడియోకు తీసుకుపోతడు. నా జీవితంలో నా భర్తను కాకుండా మరొకరిని ఇష్టపడుతున్నానంటే అది మా నానమ్మ లక్ష్మమ్మనే. చాలామందికి అమ్మ అంటే ప్రేమ కానీ, నాకు మాత్రం నానమ్మే ప్రాణం. చిన్నతనం నుంచి ఆమెతోనే అన్ని విషయాలు పంచుకునేదాన్ని. నాకు కష్టం రాకుండా చూసుకుంటది. 2017 నుంచి నా దగ్గరే ఉంటూ నేను స్టూడియోకు పోయినప్పుడు నా ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది.
సినిమా పాటల్లో గాయని చిత్రమ్మ పాటలంటే ఇష్టం. అవకాశమొస్తే ఆమెతో కలిసి పాడాలనే కోరికుంది. జానపద గాయకుల్లో మాత్రం అందరి పాటలనూ అభిమానిస్తాను. ఒక సింగర్ ఒక రకమైన పాటలు మాత్రమే పాడుతుంటారు. నా గొంతును మాత్రం నేను అలా తయారు చేసుకోలేదు. అన్ని రకాల పాటలూ పాడటానికి నా గొంతు అనుకూలంగా ఉంటదని అంటరు. సంగీతం మీద అవగాహన లేకుండానే ఇన్నాళ్లూ పాడిన. సంగీతం నేర్చుకుంటే పాటకు వంద శాతం న్యాయం చేయొచ్చని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో జానపదం కోర్సులో పీజీ చేస్తున్నా. భవిష్యత్తులో సమాజానికి మేలు చేసే పాటలే పాడుతాను. ఇప్పటివరకు మాకు సొంతిళ్లు లేదు. ఎప్పటికైనా ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలనేది నా కల.

Peddi Reddy Song 02
లక్షల్లో ఒక్కరికి మాత్రమే వచ్చే వ్యాధి నాకు 2018లో వచ్చింది. శరీరమంతా ఇన్ఫెక్షన్ అయి ముక్కులోంచి రక్తం వచ్చేది. క్యాన్సర్ అని అనుమానంతో పరీక్షలు చేయించినా అది కాదని తేలింది. అది తగ్గించడం కోసం దావఖానలో స్టెరాయిడ్స్ ఎక్కించడం వల్ల నా రెండు కాళ్ల బొక్కలు అరిగిపోయినయి. ఇంత చిన్న వయసులో ఆపరేషన్ చేయకూడదని, 40 ఏండ్లు దాటిన తర్వాత కాళ్లకు ఆపరేషన్ చేస్తమని డాక్టర్లు చెప్పినరు. ఎక్కువ గంటలు కూర్చున్నా, నిలుచున్నా కాళ్లు నొప్పిలేస్తాయి. ఇలా రెండు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రతి రోజూ మందులు మింగుతున్నా. నా బాధ ఇన్నాళ్లూ ఎవరికీ చెప్పుకోలే!
-రాజు పిల్లనగోయిన