న్యూయార్క్, జనవరి 10: దేశ వృద్ధిరేటుకు టారిఫ్ల సెగ గట్టిగానే తాకనున్నది. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలను విధించడంతో వృద్ధి వేగానికి బ్రేకులు పడ్డటు అయిందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఇప్పటికే అంచనావేస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఈ జాబితాలోకి చేరింది. టారిఫ్ల కారణంగా భారత్ వృద్ధి 6.6 శాతానికి పరిమితం కానున్నదని ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అంచనాలు 2026’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది 7.4 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం భారత్లో ప్రజల పెట్టుబడులు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ టారిఫ్ల రూపంలో దెబ్బపడనున్నదని అభిప్రాయపడింది. ఇటీవలకాలంలో పన్నుల్లో సంస్కరణలు, రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ స్వల్పకాలంపాటు దీని ప్రభావం ఉంటుందని, కానీ, సుంకాలు పెంచడంతో దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నదని పేర్కొంది. 2027లో కూడా భారత్ 6.7 శాతం వృద్ధిని సాధించనున్నదని తెలిపింది. దేశీయ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకు అవుతుండటం ఇందుకు కారణమని విశ్లేషించింది. కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లకు మినహాయింపు నివ్వడమే. దేశ వృద్ధిరేటులో కీలకపాత్ర పోషిస్తున్న తయారీ, సేవల రంగం నిరాశాజనక పనితీరు కనబరుస్తున్నాయని పేర్కొంది.