SRDP | సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా గ్రేటర్‌తో పాటు శివారు మున్పిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. రూ. 1094 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తూ ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతోంది.
నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుకుండా ఉండేందుకు 133 చోట్ల లింకు రోడ్లను నిర్మిస్తే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రోడ్లను మొదటగా గుర్తించి దశల వారిగా నిర్మాణం పనులు చేపట్టి పూర్తి అందుబాటులోకి తీసుకువస్తోంది. అలా మొత్తం 5 దశల్లో మొత్తం 66 చోట్ల లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఇందులో ఎక్కువ శాతం వెస్ట్‌జోన్‌లోనే ఉండగా..ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం లభించింది.
ఈ క్రమంలోనే కోర్ సిటీలోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు ఒక్కటే మార్గం కాదని భావించి లింకు రోడ్ల సాహసోపేతమైన నిర్ణయం మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఒక్క ఫ్లై ఓవర్‌కు పెట్టే ఖర్చులో నాలుగు లింకు రోడ్లు.. అందులో తక్కువ ఖర్చు కావడంతో ఈ దిశగా అడుగులు వేశారు. శివారు మునిసిపాలిటీల్లో పనులు పట్టాలెక్కగా..మిగిలిన చోట టెండర్ దశలో ఉన్నాయి. కొత్తూరు, శంషాబాద్, బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, పోచారం, బండ్లగూడ జాగీర్, ఘట్కేసర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్ సిటీలో ప్రసుత్తం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అలాంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో తలెత్తకుండా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సిద్ధం చేసింది. వచ్చే 50 ఏళ్ల వరకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోయేలా నగరంలో రోడ్ నెట్ వర్క్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో మొత్తం 66 లింకు రోడ్ల నిర్మాణ పనులను దశల వారిగా చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొదటి దశలో రూ.313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. రెండవ దశలో రూ.232.62 కోట్ల వ్యయంతో కొత్తగా 13 చోట్ల లింకు రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. ఒకవైపు రెండవ విడత పనులు శరవేగంగా జరుగుతుండగానే మూడవ విడత పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు అత్యధిక శాతం గ్రేటర్ పరిధిలోనే ఈ లింకు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా నగర వ్యాప్తంగా స్లిప్‌రోడ్లు, లింకు రోడ్లను నిర్మిస్తున్నారు.
రోడ్ల నిర్మాణానికిగానూ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు భూ సేకరణ పూర్తి చేస్తుండగా, హెచ్ఆర్డీసీఎల్ విభాగం అధికారులు రహదారుల నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. ఈ లింకు రోడ్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి రావడం ద్వారా ప్రధాన రహదారుల వెంబడే కాకుండా కొత్తగా అభివృద్ధి చేసిన లింకు రోడ్ల వెంబడి, అంతర్గత రహదారుల పొడవునా భూముల ధరలు పెరగడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45 నుంచి రాయదుర్గం, మణికొండ, ల్యాంకోహిల్స్ మీదుగా నానక్‌రాంగూడ ఔటర్ రింగు రోడ్డు వరకు ప్రతిపాదించిన లింకు రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటికే రోడ్ నం.45 నుంచి రాయదుర్గం మల్కంచెరువు మీదుగా మణికొండ చిత్రపురి వరకు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మిగతా భాగమైన ల్యాంక్ హిల్స్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఉన్న లింకు రోడ్లు పనులు చురుగ్గా జరుగుతుండగా, రెండు నెలల వ్యవధిలోనే ఇది పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి ఐఎస్బీ మీదుగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వెళ్లే ప్రధాన రహదారిలో టీఎన్జీవో కాలనీకి వెళ్లేలా విశాలమైన లింకు రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఐటీ కారిడార్‌లో అత్యంత రద్దీ కలిగిన ప్రాంతాల్లో ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లోని విప్రో సర్కిల్ ఒకటి. ఇక్కడి నుంచి నానక్‌రాంగూడ, గోపన్‌పల్లి, కోకాపేట, గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ వైపు వెళ్లాలంటే వాహనదారులు నిమిషాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి.
ఐఎస్బీ తర్వాత ఉన్న మైక్రో సాప్ట్ ప్రధాన కార్యాలయం పక్క నుంచి కొత్తగా హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద కొత్తగా విశాలమైన రహదారిని నిర్మించారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పనులు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలకు అనుమతులిచ్చారు. దీంతో ఇప్పటి వరకు టీఎన్జీవో కాలనీ నుంచి గోపన్‌పల్లి వెళ్లే రహదారిలోని క్యూసిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి విప్రో సర్కిల్‌కు రావాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో సుమారు 2 కి.మీ దూరం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన లింకు రోడ్డు టీఎన్జీవో కాలనీ నుంచి నేరుగా ఐఎస్బీ రోడ్డుకు కలిసేలా లింకు అందుబాటులోకి రావడంతో ఆ కాలనీ వాసులు ఊరట చెందుతున్నారు. విప్రో సర్కిల్ నుంచి గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, తెల్లాపూర్ మీదుగా కొల్లూరు వెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయి.
రాయిదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి గచ్చిబౌలి-షేక్‌పేట (పాత ముంబయి హైవే)ను కలుపుతో 120 అడుగుల వెడల్పు కొత్త లింకు రోడ్డును నిర్మించారు. రాయిదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ పక్కన ఉన్న భారీ కొండ ప్రాంతాన్ని తొలుస్తూ విశాలమైన రహదారిని నిర్మించారు. దుర్గం చెరువు మీదుగా, ఇనార్బిట్ మాల్ నుంచి, మైండ్ స్పేస్ రహేజ్ ఐటీ పార్కు, ఐకియా కూడలి నుంచి వచ్చే వాహనాలన్నీ నాలెడ్జ్ సిటీ మీదుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాత ముంబయి హైవేను కలిసేలా నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలు, నివాస భవనాలకు తోడు కొత్తగా పదుల సంఖ్యలో బహుళ అంతస్థుల వ్యాపార, వాణిజ్య భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ ఒత్తిడి బయోడైవర్సిటీ జంక్షన్ మీద పడకుండా మైహోం భూజ, కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకుంటున్న టీ హబ్ భవనం ఎదురుగా 120 అడుగుల వెడల్పుతో ఈ లింకురోడ్డును నిర్మించారు.
శివారు ప్రాంతాలలో పట్టణీకరణకు లింకు రోడ్లు ఎంతో అనుకూలంగా మారుతున్నాయి. భవిష్యత్తు అవసరాలను గుర్తించి విశాలమైన రోడ్లను నిర్మిస్తుండడంతో ఎంతటి ట్రాఫిక్ రద్దీనైనా తట్టుకునేలా ఈ లింకు రోడ్లు వస్తున్నాయి. సిటీ లోపల నుంచి అనుసంధానమే కాకుండా బయట ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ లింకు రోడ్లన్నీ ఎంతో దోహదపడుతున్నాయి. మెట్రో నగరాల్లోనే ఈ లింకు రోడ్లు సరికొత్త పట్టణ ప్రణాళికగా పట్టణ ప్రణాళికా నిఫుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయ రహదారులు చాలా అవసరం ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి వివిధ దశల్లో నిర్మాణం చేపట్టింది.