జనగామ, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భూభారతి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చామని బీరాలు పలికిన పోర్టల్‌లో లొసుగులను ఆసరా చేసుకున్న అక్రమార్కులు కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొనలేదు. పత్రికలు పతాక శీర్షికల్లో స్కామ్‌లను ప్రచురించి లోకాయుక్త సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించిన తర్వాత గానీ సర్కార్ మొద్దునిద్ర వీడలేదు. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలను ప్రారంభించిన అధికారులు.. నష్టపోయిన మొత్తాన్ని కొనుగోలుదారుల నుంచి రాబట్టేందుకు సిద్ధమయ్యారు.
జనగామ జిల్లా కేంద్రంగా వెలుగుచూసిన ఈ వ్యవహారంలో తక్కువ స్టాంప్‌డ్యూటీ రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారనే నెపంతో భూములు కొనుగోలు చేసిన వారికి జనగామ తహసీల్దార్ తాజాగా నోటీసులు జారీ చేశారు. మార్కెట్ విలువలు యూఎస్ 47ఏ కింద మార్కెట్ విలువ నిర్ధారణ స్టాంపు, ఫీజు వసూలు కోసం.. డిసెంబర్ 24న రిజిస్ట్రేషన్ చేసుకున్న శ్రీభాష్యం నర్సింహాచార్యులు, రంగినేని వెంకటేశరరావుకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. దస్తావేజుకు సంబంధించి పూర్తిస్థాయి స్టాంపు, రిజిస్ట్రేషన్ చార్జీలు మొత్తం రూ.1,24,872 మూడు రోజుల్లో చెల్లించి దస్తావేజును రెగ్యులర్ చేయించుకోవాలని పేర్కొన్నారు. ఇలా ఒక్క జనగామ మండలంలోనే 22 దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అక్రమాలపై కొనుగోలుదారులకు నోటీసులు అందజేసినట్టు తెలిసింది. అయితే జనగామ జిల్లావ్యాప్తంగా దాదాపు వందకుపైగా డాక్యుమెంట్లకు సంబంధించి రెవెన్యూశాఖ.. తగ్గించి చెల్లించిన సొమ్మును రికవరీ కోసం కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. రికవరీ పేరుతో రెవెన్యూ అధికారులు జారీ చేసిన నోటీసులతో కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది.
జనగామ జిల్లా కేంద్రంతోపాటు పాలకుర్తి, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లోని మీసేవ కేంద్రాల నిర్వాహకులు, స్లాట్ బుకింగ్ కేంద్రాలు నడుపుతున్న వారి నుంచి ప్రధాన సూత్రధారి యాదాద్రి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ప్రింటర్ యాప్ ద్వారా దాదాపు రూ.కోటికిపైగా సొంత ఖాతాలోకి మళ్లించుకొన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. మీసేవ కేంద్రాలు, స్లాట్ బుకింగ్ నిర్వాహకులను అప్రూవల్‌గా మారాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ కుంభకోణం వెనుక హైదరాబాద్ కేంద్రంగా కీలక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుండగా, మొత్తం స్కామ్ మూలాలను రాబట్టే పనిలో సీసీఎస్ పోలీసులు నిమగ్నమయ్యారు.
భూభారతిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ చలాన్ల చెల్లింపులో జరిగిన భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందుచూపుతో ప్రతిష్ఠాత్మకంగా ధరణి పోర్టల్‌ను ప్రారంభించి సమర్థవంతంగా అన్ని హంగులతో అమలు చేసి భూ క్రయ,విక్రయదారుల మన్ననలు పొందినట్టు తెలిపారు.
అన్ని వర్గాల మన్ననలు పొందుతున్న ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ లొసుగులతో కూడిన భూభారతి పోర్టల్‌ను తెచ్చిందని విమర్శించారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కాంగ్రెస్ నాయకుల అండదండలతో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ కుంభకోణాన్ని మీడియా వెలికితీసి లోకాయుక్త స్పందించే వరకు కూడా ప్రభుత్వానికి సోయి లేకపోవడం విచారకరమని అన్నారు.
స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన మొత్తంలో 10 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ కాగా మిగతా 90 శాతం ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించేలా లోపభూయిష్టంగా భూభారతి పోర్టల్‌ను తయారు చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను బద్నాం చేయడంలో చూపిన శ్రద్ధ భూభారతి పోర్టల్‌ను పకడ్బందీగా తయారు చేయడంలో చూపలేదని మండిపడ్డారు. లొసుగులతో కూడిన పోర్టల్‌ను ప్రారంభించిన ఫలితంగానే రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం జరిగిందని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.