Congress | యావత్ దేశం తెలంగాణ ఎన్నికలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. పోలింగ్‌కు మరో 18 రోజులున్న క్రమంలో గెలుపోటములు, పోటీ ద్విముఖమా.. త్రిముఖమా.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతున్నది. తెగించి కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రం, పదేండ్లలో అబ్బురపరిచే సంక్షేమాభివృద్ధి పథకాలు, జాతీయ విస్తరణలో బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్న క్రమంలో వచ్చే ఈ ఎన్నికలపై రసవత్తర చర్చ కొనసాగుతుండటం సహజం.
అన్నివర్గాల మెప్పు పొంది మూడోసారి ముచ్చటగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల సామర్థ్యం బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని అనేక సర్వేలు సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఈ సందర్భంలో కూడికలు, తీసివేతల లెక్కలతో కాంగ్రెస్ విజయావకాశాలున్నాయని చెప్పేవారూ ఉన్నారు. తెలంగాణలో మొన్నటివరకు పోటీ త్రిముఖంగా ఉంటుందని అంచనా వేసినా పోలింగ్ సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ద్విముఖ పోటీయే ఉంటుందని స్పష్టం అవుతున్నది. అధికార బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ ఇప్పటికే సగానికి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తిచేశారు. మరో పక్క బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రతి వైఫల్యాన్ని జనంలో కడిగేస్తున్నారు.
ప్రచారపర్వం ఊపందుకుంటున్న క్రమంలో అభ్యర్థుల గెలుపోటములపై అంచనాలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోని ఒక వర్గం అప్పుడే కాంగ్రెస్ గాలి వీస్తోందంటూ ప్రచారం చేస్తున్నది. నిజంగా కాంగ్రెస్‌కు గాలి ఉందా? నామినేషన్ల ఘట్టం వరకు అభ్యర్థులనే తేల్చని ఆ పార్టీ గెలుస్తుందా అని బుద్ధిజీవుల ప్రశ్న. తెలంగాణలో ఇంతకూ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉన్నదా? ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు ఎక్కడినుంచి వస్తాయి. ఎలా వస్తాయి? అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అని మొక్కి ఫలాలు ఆశించినట్టే కాంగ్రెస్ వైఖరి కనిపిస్తున్నది.
ఉమ్మడి ఏపీలో గాని, తెలంగాణలో గాని ఆ పార్టీ బలమెంత? వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఆ పార్టీ గాలి లేదన్నది స్పష్టం. తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యేలకుగాను ఎప్పుడూ ఆ పార్టీ సగం సీట్లు కూడా పొందలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 21 మాత్రమే. 2018-19 ఎన్నికల్లోనూ ఆ పార్టీ పొందిన సీట్లు 19 మాత్రమే. అంటే గత 20 ఏండ్లుగా కనీసం 50 స్థానాలెప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంతంగా కైవసం చేసుకోలేదు. 2004లో పొత్తులతో కాంగ్రెస్‌కు 48 సీట్లొస్తే, టీఆర్ఎస్కు 26 స్థానాలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడూ, ఇప్పుడూ సొంతంగా ఏనాడూ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది.
ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని స్వరాష్ట్రంలో తొలిసారి 63 స్థానాలను కైవసం చేసుకున్నది. 2018లో 88 స్థానాలు గెలుచుకొని అజేయంగా నిలబడింది. ఇక తెలంగాణ వచ్చిన ఈ పదేండ్లలో సంస్థాగతంగా కాంగ్రెస్ లేదు. లోగడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని, గ్రేటర్ ఎన్నికల్లో గాని ఆ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైంది. మరి ఆ పార్టీకి గాలి ఎక్కడినుంచి వీస్తోంది, ఎలా వీస్తోంది. ఇదంతా ఉత్త ప్రచారమే అన్నది అసలు వాస్తవం.
ఎవరవునన్నా, కాదన్నా.. గతంలో తెలంగాణ ఎట్లుండె, ఇప్పుడెట్లున్నదని జనం పోల్చుతున్న మాట నిజం. పదేండ్ల కాలంలో కొత్త సంక్షేమాభివృద్ధ్ది పథకాలను బీఆర్ఎస్ పరిచయం చేసింది వాస్తవం. గతంతో పోల్చితే పేదరికం తగ్గింది. పల్లెల రూపురేఖలు మారాయి. పట్టణాలు, నగరాల అభివృద్ధి ఎల్లలు దాటిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండి మరీ ప్రజలకు బీఆర్ఎస్ను మరింత చేరువ చేశారు. గత అరువై ఏండ్ల తెలంగాణ, ఈ పదేండ్ల తెలంగాణను కండ్లారా చూస్తున్న ఆ తరం, ఈ తరం జనం మళ్లీ కష్టాలను కొనితెచ్చుకుంటారా? చెట్టు మీద ఉండి మరీ కొమ్మను నరుక్కుంటారా? మరి కాంగ్రెస్ వైపు గాలి ఉన్నదని గాలివాటం ప్రచారాలు ఏ మేరకు వాస్తవం.
మెజారిటీ ప్రభుత్వ పథకాలు అందరికీ చేరువయ్యాయి. మిషన్ కాకతీయ ఫలాలు ప్రతీ రైతు, ప్రతీ ముదిరాజ్ సమూహం అనుభవిస్తున్నది. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నీళ్లొచ్చాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. రైతుబంధు పథకంతో రైతు కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయి. 24 గంటల కరెంటుతో తెలంగాణ వ్యవసాయమే ఓ పండుగైంది. పింఛన్లతో ప్రతి లబ్ధ్దిదారుడు నెలకు ఠంచన్‌గా జీతం తీసుకున్నట్టే నెలవారీగా పొందుతున్నాడు. రోడ్లు, వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, కమ్యూనిటీ హాళ్లు, బడి, గుడి, దవాఖానాలతో ప్రతి పల్లె కొత్త శోభను సంతరించుకున్నది. ఇక బీసీ కులాల్లో చేపల ఉత్పత్తిలో ముదిరాజ్‌లు దేశంతో పోటీ పడుతున్నారు. గొర్రెల పెంపకంతో యాదవ సమాజం సగౌరవంగా బతుకుతున్నది.
వృత్తుల ఆధునీకరణతో గౌడన్నలు, పద్మశాలి, స్వర్ణకారులకు చేతినిండా పని దొరుకుతున్నది. బీసీ కులాలు ఆత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర రాజధానితో పాటు ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఆత్మగౌరవ భవనాలు మంజూరీ చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు, బీసీబంధు వంటి పథకాలు నిరంతరం సాగే ప్రక్రియ. ప్రభుత్వం శాశ్వతం.. పథకాలు శాశ్వతమనే భావనతో ఉంటే ప్రతీ పథకం ప్రతీ ఒక్క లబ్ధ్దిదారున్ని విధిగా చేరి తీరుతుంది. అలాంటి సంక్షేమ సర్కారును కాదని కాంగ్రెస్ గాలి వీస్తుందనేది ఆ పార్టీ ఆశాపరులు చేస్తున్న ఒట్టి ప్రచారమే. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించటం ఖాయం. సీఎం కేసీఆర్ హాట్రిక్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయడం పక్కా..
– గుంటిపల్లి వెంకట్ 94949 41001