Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు. జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని మిస్ అవుతుందని.. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు జట్టు పూర్తిగా సిద్ధమైందని భావిస్తున్నానన్నారు. టీ20 ప్రపంచకప్లో విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై వీరిద్దరూ వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నారు. రోహిత్, విరాట్ స్థాయి వ్యక్తులను మార్చడం ఎప్పటికీ అంత సులభం కాదని విక్రమ్ రాథోడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
జింబాబ్వే టూర్కు వెళ్లిన జట్టుపై స్పందిస్తూ.. భవిష్యత్లో టీ20 జట్టు ఎలా ఉంటుందో కొంత తెలిసివచ్చిందన్నారు. అత్యున్న స్థాయికి చేరుకునేందుకు టెస్ట్, వన్డే క్రికెట్లో మరికొంత అనుభవం అవసరమని చెప్పారు. భారత్ క్రికెట్లో యువ ఆటగాళ్లు చాలా ప్రతిభావంతులు ఉన్నారని.. దాని గురించి తాను ఆందోళన చెందడం లేదన్నారు. మార్పులు నియంత్రిత పద్ధతిలో జరిగేలా చూసుకోవాలన్నారు. రోహిత్, కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ అయ్యే నాటికి యువ ఆటగాళ్లు బాగా స్థిరపడి, వచ్చే 10 ఏళ్లపాటు జట్టుకు పునాదిగా నిలుస్తారని రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికి శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ తదితర ఆటగాళ్లు స్థిరపడాలని ఆశిస్తున్నానని.. వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారన్నారు.