Team India : భారత్, బంగ్లాదేశ్ వైట్‌బాల్ సిరీస్ కొత్త తేదీలు వచ్చేశాయి. పొరుగుదేశంలో నిరుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన సిరీస్ సెప్టెంబర్ నెలలో జరునుంది. ఈ విషయాన్ని శుక్రవారం బంగ్లాదేశ్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. గతేడాది ఆగస్టులో వాయిదా పడిన బంగ్లాదేశ్, టీమిండియా వైట్‌బాల్ సిరీస్ తేదీలను రీషెడ్యూల్ చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు భారత జట్టు రానుంది అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చీఫ్ షహరీర్ నఫీజ్ తెలిపాడు.
కొత్త ఏడాదిని పురస్కరించుకొని శుక్రవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 2026లో అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ తేదీలను బీసీబీ ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం భారత జట్టు సెప్టెంబర్‌లో బంగ్లాలో వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది.
The Bangladesh Cricket Board has announced the itinerary for the white-ball series against India
ODIs: September 1, 3, 6
T20Is: September 9, 12, 13 #2026CricketCalendar pic.twitter.com/CIDvTZo5eC— Cricbuzz (@cricbuzz) January 2, 2026
మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం భారత బృందం ఆగస్టు 28న బంగ్లాకు వెళ్లనుంది. అనంతరం సెప్టెంబర్ 1న తొలి వన్డేతో సిరీస్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 3న రెండో వన్డే, సెప్టెంబర్ 6న మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును టీమిండియా ఢీకొడుతుంది. అనంతరం సెప్టెంబర్ 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ షురూ అవుతుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సిరీస్ ముగుస్తుంది.
నిరుడు ఆగస్టులోనే టీమిండియా వైట్‌బాల్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లాల్సింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 17 నుంచి బంగ్లాదేశ్‌లో భారత్ మూడు వన్డేలు, టీ20 సిరీస్‌లో ఆడాల్సి ఉంది. కానీ, మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లతో పర్యటనను బీసీసీఐ వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక సిరీస్‌ను నిర్వహించాలని ఇరుదేశాల బోర్డులు భావించాయి. బంగ్లాలో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం.. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. అందుకనే కొత్త ఏడాది రెండో రోజునే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైట్‌బాల్ సిరీస్ తేదీలను ప్రకటించింది.