SAW vs SCOW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ఆశలు సన్నగిల్లిన వేళ దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్లు దంచి కొట్టారు. భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితుల్లో స్కాంట్లాండ్ బౌలర్లను ఉతికేశారు. ఓపెనర్లు తంజిమ్ బ్రిట్స్(43), లారా వొల్వార్డ్త్(40)లు బౌండరీలతో విరుచుకుపడగా.. ఆల్‌రౌండర్ మరినే కాప్(43) సైతం చితక్కొట్టింది. దాంతో, దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోర్. రికార్డు లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ (Scotland) చరిత్ర సృష్టిస్తుందా? లేదా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లండ్‌పై చేజేతులా ఓడిన సఫారీ జట్టుకు ఇది కీలక మ్యాచ్ కావడంతో ఓపెనర్లు లారా వొల్వార్డ్త్(40), తంజిమ్ బ్రిట్స్(43)లు తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ బౌండరీలతో చెలరేగారు. దాంతో, ఈ ఎడిషన్‌లో వేగవంతంగా యాభై కొట్టేసింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. సఫారీ స్కోర్‌బోర్డును ఉరికిస్తున్న ఈ జోడీని క్యాథరిన్ ఫ్రేజర్ విడదీసింది.
Aggressive South Africa post the highest total in Women’s #T20WorldCup 2024 👏#SAvSCO #WhateverItTakes
— ICC (@ICC) October 9, 2024
ఆ కాసేపటికే ఒలివియా బెల్ ఓవర్లో తంజిమ్ బ్రిట్స్(43) సైతం వెనుదిరిగింది. 119 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో మరినే కాప్(43: 24 బంతుల్లో ఆరు ఫోర్లు) స్కాంట్లాండ్ బౌలర్లను ఎడాపెడా ఉతికేసింది. సునే లుస్(18)తో కలిసి 28 పరుగులు జోడించింది. దాంతో, సఫారీ జట్టు 5 వికెట్ల నష్టానికి 166 పరుగుల భారీ స్కోర్ కొట్టింది.