AAP MP : హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana assembly elections) ఫలితాలపై ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) తనదైన శైలిలో స్పందించారు. హర్యానా ఫలితాలు బీజేపీకి గెలుపు కంటే తక్కువ, కాంగ్రెస్ పార్టీకి ఓటమి కంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో్ ప్రతిపక్ష కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పోటీచేస్తే ఫలితాలు కచ్చితంగా ఇందుకు భిన్నంగా ఉండేవని చద్దా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే బీజేపీని ఒంటరిగా ఓడించే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేదన్నారు.
దేశంలో ఇంకా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలిచే అవకాశాలు లేవని చద్దా అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ పరస్పర సహకారంతో కూటమిగా పోటీచేస్తేనే ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్షపోరు జరిగిందని, ఆ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కు ఓటమి తప్పలేదని అన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేయాలని భావించిందని, కానీ అది జరగలేదని, ఫలితంగా బీజేపీ స్వల్ప తేడాతో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బీజేపీని సొంతంగా ఓడించలేని స్థితిలో ఉన్నదో అక్కడ కూటమి పార్టీలను కలుపుకుంటే ఫలితాలు అనుకూలంగా వస్తాయని చద్దా సూచించారు.