AAP | హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) ఫలితాలు కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. హస్తం పార్టీ అంచనాలను తలకిందలు చేస్తూ.. బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఈ అనూహ్య ఫలితాలతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ వైఖరిపై మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్య పక్షాలను హస్తం పార్టీ పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అతివిశ్వాసం మితిమీరిందని విమర్శిస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi polls) ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ (Priyanka Kakkar) మాట్లాడుతూ.. తన భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి అతివిశ్వాసం మితిమీరిపోయిందని, ఆ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానాలో ఆప్, సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆప్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, అహంకార బీజేపీపై పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని ప్రియాంకా కక్కర్ అన్నారు.
Also Read..
Haryana | హర్యానాలో బీజేపీకి బిగ్ బూస్ట్.. సావిత్రి జిందాల్ సహా వారంతా కమలం పార్టీవైపే
RBI | యూపీఐ యూజర్లకు ఆర్బీఐ గుడ్న్యూస్.. యూపీఐ లైట్ లిమిట్ భారీగా పెంపు..!