Farooq Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేసిందంటూ ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ (National conference) పార్టీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్ముకశ్మీర్లో ద్వేషానికి పుట్టుకను ఇచ్చిందెవరు..? కాంగ్రెస్ పార్టీనేనా..?’ అని బీజేపీని ఉద్దేశించి ఫరూఖ్ అబ్దుల్లా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జమ్మూలో ద్వేషానికి బీజం వేసిందే బీజేపీ కదా అని మండిపడ్డారు.
‘ఎన్నికలకు ముందు జమ్ముకశ్మీర్లో విద్వేషాలు సృష్టించేందుకు హోంమంత్రి అమిత్ షా వచ్చాడు. ప్రధాన మంత్రి మోదీ వచ్చాడు. పలువురు కేంద్ర మంత్రులు వచ్చారు. గతంలో ఇక్కడ ఉగ్రవాదం ఉండేదని చెప్పారు. మేం ఎన్నడూ ఉగ్రవాదాన్ని సహించలేదు. భవిష్యత్తులో కూడా సహించబోం’ అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. అదేవిధంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీకి ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేయడంపై కూడా అబ్దుల్లా స్పందించారు.
‘భారత రాజ్యాంగం ప్రకారం ఇలా లెఫ్టినెంట్ గవర్నర్ జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎమ్మెల్యేలను నామినేట్ చేయకూడదు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ పని చేస్తుంది. దీనిపై మేం సుప్రీంకోర్టు వెళ్తాం. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు మా పిటిషన్పై విచారణ జరిపి, మాకు న్యాయం చేస్తుందని మేం భావిస్తున్నాం’ అని అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ పార్టీల కూటమి విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలకుగాను కూటమి 49 స్థానాల్లో గెలిచింది. అందులో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. ఇక బీజేపీ కేవలం 29 స్థానాలకు పరిమితమైంది. స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. ఆప్ ఒక చోట నెగ్గింది.