గువాహటి : స్వదేశంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో యువ షట్లర్ తన్వి శర్మ సరికొత్త చరిత్ర లిఖించింది. ఉమెన్స్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకున్న 16 ఏండ్ల తన్వి.. 17 ఏండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ ఈ టోర్నీలో దేశానికి మెడల్‌ను అందించిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. శుక్రవారం ఇక్కడ జరిగిన క్వార్టర్స్‌లో తన్వి.. 13-15, 15-9, 15-10తో సాకి మసుమొటొ (జపాన్)ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో భాగంగా తొలి గేమ్‌లో 10-6తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ తర్వాత తన్వి తడబాటుకు గురైంది. ఆమె చేసిన తప్పిదాలను అవకాశంగా మలుచుకుని జపాన్ అమ్మాయి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో 5-5తో స్కోర్లు సమమైనప్పటికీ ఎటాకింగ్ గేమ్‌తో రెచ్చిపోయిన 16 ఏండ్ల భారత అమ్మాయి.. ప్రత్యర్థికి షాకిచ్చింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ముసుమొటొ 7-3తో ఆధిక్యంలో ఉన్నా తన్వి దూకుడు పెంచి 11-9తో పోటీలోకి వచ్చింది. అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ నెగ్గి పతకాన్ని ఖాయం చేసుకుంది. 2008లో పూణె వేదికగా జరిగిన ఈ టోర్నీలో సైనా నెహ్వాల్ స్వర్ణం గెలిచిన తర్వాత భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం విశేషం.
తన్వి సెమీస్ చేరినప్పటికీ మిగిలిన షట్లర్లకు మాత్రం నిరాశ తప్పలేదు. పతకంపై ఆశలు రేపిన ఎనిమిదో సీడ్ ఉన్నతి హుడా.. 12-15, 13-15తో అన్యపత్ ఫిచిట్ఫొన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో భవ్య-విశాక జోడీకి 9-15, 7-15తో హంగ్ బింగ్ ఫు-చౌ యున్ (చైనీస్ తైఫీ) చేతిలో పరాజయం తప్పలేదు. బాయ్స్ సింగిల్స్‌లో జ్ఞాన దత్తు.. 11-15, 13-15తో లి యాంగ్ మింగ్ యు (చైనా) చేతిలో ఓడాడు.