విలు విద్యలో రాణించాలంటే అర్జునుడికి ఉన్నంత గురి ఉంటే సరిపోదు. లక్ష్యాన్ని ఛేదించాలంటే ముందుగా లక్ష్మీకటాక్షం ఉండాలి. సరైన శిక్షణ దొరకాలి. నగరవాసులకు, అందులోనూ సంపన్నుల క్రీడగా పేరున్న విలు విద్యలో సవ్యసాచి అనిపించుకోవాలంటే.. అదృష్టమూ కలిసిరావాలి. అలాంటి ఆటలో మేటి అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ తానిపర్తి చికిత. పల్లెసీమలో విల్లంబులు ధరించిన ఈ యువతి… ఆర్చరీ ఏషియా కప్‌లో నారి సారించడానికి సిద్ధమవుతున్నది. ఈ ఘనత సాధించిన తెలంగాణ తొలి ఆడబిడ్డ చికిత కథ ఆమె మాటల్లోనే..
మాది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్. నాన్న శ్రీనివాసరావు రైతు. అమ్మ శ్రీలత గృహిణి. రెండో తరగతి వరకు సుల్తాన్పూర్లోనే చదివా. తర్వాత పదో తరగతి దాకా కరీంనగర్‌లోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ (ఎస్పీఆర్)లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో కరాటే నేర్చుకునేదాన్ని. ఒకసారి కరీంనగర్ స్టేడియంలో ఆర్చరీ పోటీలు జరుగుతుంటే చూశాను. ఆటగాళ్లు గురి చూసి లక్ష్యాన్ని ఛేదిస్తుండటం భలేగా అనిపించింది. విలు విద్య నేర్చుకోవాలనిపించింది. అదే విషయాన్ని మా కరాటే మాస్టర్ ప్రదీప్ సార్‌కు చెప్పాను. ఆయన నన్ను ట్రినిటీ పాఠశాల పీఈటీ నారాయణ సార్‌కు పరిచయం చేశారు.
ఆయన ఓ వారం పాటు బేసిక్స్ నేర్పించారు. అంతలో మా బాబాయ్ ఆర్చరీ రికరో బో కొనిచ్చారు. నాన్న తోడ్పాటుతో ఇంటి దగ్గరే కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశా. తర్వాత సెలవుల్లో పీఈటీ సార్ దగ్గర మరో వారం శిక్షణ తీసుకున్నా. సెలవులు అయ్యాక కరీంనగర్ జిల్లాలోనే సీనియర్ ప్లేయర్ శ్రీనివాస్ ఉన్నారని తెలిసింది. నాన్న ఆయనకు నన్ను పరిచయం చేశారు. ఆయన దగ్గర ఆటలో మెలకువలు తెలుసుకున్నా. ప్రతిరోజూ సుల్తాన్పూర్ నుంచి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేసేదాన్ని. 2019లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన గారు ప్రభుత్వం నుంచి ఉచితంగా విల్లంబులు అందించారు. ఎన్టీపీసీ, కలెక్టర్ సహకారంతో నా శిక్షణ నిరాటంకంగా సాగింది. క్రమంగా ఆటపై పట్టు సాధించాను.
పదో తరగతి తర్వాత గర్రెపల్లి ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. మరోవైపు ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనేదాన్ని. 2018, 19లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించడంతో ఈ క్రీడలో రాణించగలననే నమ్మకం కుదిరింది. 2019లో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో బంగారు పతకం గెలిచాను. 2022లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలోనూ పసిడి పతకం అందుకున్నా. అలా నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఇండియా (ఎన్ఏఏఐ) దృష్టిలో పడ్డాను. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన 32 మంది క్రీడాకారులను ఎంపిక చేయగా అందులో నేనూ ఉన్నాను. తర్వాత నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్స్ ప్రాబబుల్స్‌లోనూ చోటు దక్కింది. 2022లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ నుంచి ఎంపికైన ఆర్చర్‌గా గుర్తింపు సాధించాను. నా కోసం అమ్మానాన్న ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చారు. ఆర్చరీ ఖర్చుతో కూడుకున్న క్రీడ. అందరి సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నా.
ఈ ఏడాది జరగనున్న ఆర్చరీ ఏషియా కప్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఈ ఫిబ్రవరిలో జరగనున్న పోటీల్లో మన దేశానికి పతకం అందించడమే నా లక్ష్యం. మరోవైపు ఆర్చరీ వరల్డ్ కప్ పోటీలకు కూడా ఎంపికయ్యా. ఈ టోర్నీ కోసం కోల్‌కతాలో నాలుగు రోజులపాటు సెలెక్షన్స్ జరిగాయి. మొత్తం మూడు ఈవెంట్లలో 13 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి.. సెలెక్ట్ అయ్యా. నాతోపాటు మరో ముగ్గురు యువతులతో కూడిన జట్టు ఈ పోటీలో పాల్గొననుంది. ఏప్రిల్‌లో అమెరికాలో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజీ 1, మే నెలలో చైనాలో స్టేజ్ టూ పోటీలు జరుగుతాయి. ఈ వరుస పోటీల్లో సత్తా చాటి పతకం గెలవాలన్నదే నా లక్ష్యం. అన్నిటినీ మించి ఒలింపిక్స్ పతకం సాధించాలన్నది నా జీవిత ధ్యేయం.
– అంకరి ప్రకాష్, పెద్దపల్లి