ఢిల్లీ: తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్‌లో భారత అథ్లెట్లు తొలి రోజే పసిడి పంట పండించారు. ఏకంగా ఆరు విభాగాల్లో మన అథ్లెట్లు స్వర్ణాలు గెలిచి శుభారంభం చేశారు. తెలుగమ్మాయి, జ్యోతి యర్రాజి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ను 12.99 సెకన్లలోనే పూర్తిచేసి స్వర్ణం గెలిచింది. జాతీయ స్థాయిలో ఆమె రికార్డు (12.78 సెకన్లు)ను అధిగమించే అవకాశాన్ని తృటిలో కోల్పోయినా రేసులో మాత్రం ఆమె పసిడిని ముద్దాడింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సె.. 13. 52 సెకన్లలో గమ్యాన్ని ముద్దాడి పసిడి నెగ్గాడు.
మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పూజ (4:11.63 సెకన్లు), పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ (16.21 మీటర్లు)కూ బంగారు పతకాలు దక్కాయి. పురుషుల 4X100 మీటర్ల రిలే టీమ్ ఈవెంట్లో గుర్విందర్ సింగ్, మణికంఠ, అమ్లన్, అనిమేష్తో కూడిన బృందం 38.75 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి స్వర్ణం గెలిచింది. ఇదే విభాగం మహిళల కేటగిరీలో సుదీక్ష, అభినయ, స్నేహ, నిత్య బృం దం.. 44.07 సెకన్లతో రికార్డు స్థాయిలో రేసును పూర్తిచేసి గోల్డ్ మెడల్ కొట్టింది.