కాన్బెర్రా : ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో మొదటి మ్యాచ్ జరుగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు ఇదే ఆఖరి విదేశీ పర్యటన కాగా మెగా టోర్నీకి సన్నాహకంగా ఈ సిరీస్‌లో సత్తాచాటాలని యువ భారత్ భావిస్తున్నది. ర్యాంకింగ్స్‌లో 1 (భారత్), 2 (ఆసీస్) స్థానాల్లో ఉన్న ఈ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుండటం ఖాయం.
నిరుడు టీ20 ప్రపంచకప్ గెలిచాక పూర్తిస్థాయిలో భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య.. బ్యాటింగ్‌లో తనదైన శైలిలో ఆడలేకపోతున్నాడు. సారథిగా 29 మ్యాచ్‌ల్లో 23 విజయాలను అందించిన సూర్య.. బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. 2023లో 18 ఇన్నింగ్స్‌ల్లో 733 రన్స్ (2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు) చేసిన సూర్య.. 2024లో 450 రన్స్ చేశాడు. కానీ గత 10 ఇన్నింగ్స్‌ల్లో మాత్రం అతడే చేసినవి 100 పరుగులే. అర్ధ శతకం చేయక 14 ఇన్నింగ్స్‌లు దాటాయి. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు 15 కాగా అందులో ఆసీస్‌లో 5 మ్యాచ్‌లు పోను స్వదేశంలో సౌతాఫ్రికా (5), న్యూజిలాండ్ (5)తో తలపడాల్సి ఉంది. సూర్య ఫామ్‌పై ఆందోళన లేదని కోచ్ గంభీర్ చెబుతున్నా.. ఉపఖండపు పిచ్‌లకు పూర్తి భిన్నంగా ఉండే ఆసీస్ పిచ్‌లపై కెప్టెన్ ఫామ్‌ను అందుకోవాలని జట్టు కోరుకుంటున్నది. ఇక ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో సూపర్ హిట్ బ్యాటింగ్‌తో దుమ్మురేపిన అభిషేక్ శర్మ, ఫైనల్ హీరో తిలక్ వర్మకు ఆసీస్ టూర్ కఠిన పరీక్షే. అదనపు బౌన్స్‌తో ఉండే ఆసీస్ పిచ్‌లపై ఈ ఇద్దరూ ఎలా ఆడతారనేది చూడాలి. హార్ధిక్ పాండ్యా గైర్హాజరీలో నితీశ్ కుమార్, శివమ్ దూబె ఆల్‌రౌండ్ బాధ్యతలు ఏ మేరకు నిర్వర్తిస్తారనేదీ ఆసక్తికరమే! బౌలింగ్ విభాగానికి బుమ్రా నాయకత్వం వహించనుండగా అతడికి అండగా అర్ష్‌దీప్ ఉన్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే వరుణ్, అక్షర్‌తో పాటు కుల్దీప్ కూడా జట్టులో ఉంటాడు.
మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతున్నది. గత 20 టీ20 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓడింది రెండంటే రెండు మ్యాచ్‌లే అంటే కంగారూల జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్ష్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, స్టోయినిస్‌తో పాటు సంచలన ఆటగాడు మిచెల్ ఓవెన్‌తో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. జట్టు నిండా ఆల్‌రౌండర్లు ఆసీస్‌కు అదనపు బలం. హాజిల్‌వుడ్ పేస్‌ను తట్టుకుని నిలబడటం భారత టాపార్డర్‌కు కత్తిమీద సవాలే.
పిచ్ వాతావరణం : మనుకా ఓవల్ ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’లకు పెట్టింది పేరు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)తో పాటు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ తక్కువ స్కోర్లతో ముగిసినవే. స్పిన్నర్లకు అనుకూలించే మనుకాలో ఛేదన చేసే జట్టుకు విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. 2020లో ఇక్కడ ఒక మ్యాచ్ ఆడిన టీమ్ఇండియా విజయం సాధించింది.
తుది జట్లు (అంచనా) : భారత్: అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, శాంసన్, రింకూ, అక్షర్, దూబె/హర్షిత్, వరుణ్, అర్ష్‌దీప్, బుమ్రా
ఆసీస్: మార్ష్ (కెప్టెన్), హెడ్, ఇంగ్లిస్, డేవిడ్, ఫిలిప్పీ, ఓవెన్, స్టోయినిస్, అబాట్/బార్ట్లెట్, ఎల్లీస్, కున్హెమన్, హాజిల్‌వుడ్