దుబాయ్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఓపెనర్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాట్స్‌మెన్ తేలిపోయిన చోట పాకిస్థాన్ ఓపెనర్లు చెలరేగారు. భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించారు.
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో టీమిండియా సారధి కోహ్లీ చేసిన కొన్ని వ్యాఖ్యలు తనకు రుచించలేదని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ అద్భుతంగా ఆడిందని కొనియాడిన కోహ్లీ ఆ జట్టు కృషిని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ అన్న మాటలే తనకు నచ్చలేదని అజయ్ జడేజా చెప్పాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ తమపై పైచేయి సాధించిందని అన్నాడు. ‘కోహ్లీ వంటి ఆటగాడు మిడిలార్డర్లో ఉండగా అప్పటికే మ్యాచ్ ముగిసే అవకాశమే లేదు. అప్పటికి అతను కనీసం రెండు బంతులు కూడా ఆడలేదు. కానీ అలా ఆలోచించాడంటే భారత్ ఎలాంటి మనస్తత్వంతో బరిలోకి దిగిందో తెలిసిపోతోంది’ అని అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు.