T20 World Cup 2026 | వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. ఈ మెగా టోర్నీ కోసం సన్నహాలు మొదలయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. నివేదికల ప్రకారం.. టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుండగా.. మార్చి 8న ఫైనల్ జరుగుతుందని అంచనా. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఫైనల్ అహ్మదాబాద్ లేకపోతే కొలంబోలో జరిగే ఛాన్స్ ఉంది. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా స్వదేశంలో జరిగే ప్రపంచ కప్‌లోకి ప్రవేశిస్తుంది. గత ఏడాది జూన్‌లో బార్బడోస్‌లో జరిగిన చివరి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలిచింది. పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంటే టైటిల్ మ్యాచ్ శ్రీలంకలో జరుగుతుంది.
ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే అన్ని మ్యాచులు 2027 వరకు తటస్థ వేదికల్లో జరుగుతాయి. ఇదిలా ఉండగా.. మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. టోర్నీలో దాదాపు 20 జట్లు పాల్గొనున్నాయి. భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచ కప్ కోసం వేదికలను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో భారత్‌లో ఐదు, శ్రీలంకలో మూడు వేదికలు ఉన్నాయి. ఇందులోనే ప్రపంచకప్ మ్యాచులు జరుగుతాయి. బీసీసీఐ అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయిలను జాబితాలో చేర్చించింది. శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ వేదికలను ఐసీసీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.