దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఘోరమైన ప్రదర్శన ఇస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో పది వికెట్లతో ఓడిపోయిన భారత్.. గెలవక తప్పని రెండో మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ చేతిలో 8 వికెట్లతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ దిగిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌గా టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలందించిన రోహిత్‌ను వన్‌డౌన్‌లో పంపారు.
ఈ నిర్ణయంపై భారత జట్టు మాజీ సారధి, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తి చేశాడు. పాక్ చేతిలో పరాభవం తర్వాత ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటివ్వాలని చాలా మంది భావించారు. అయితే అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని అంతా అనుకున్నారు. న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో అందరూ అనుకున్నట్లే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకున్నారు. అయితే సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్‌కు పంపారు.
ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పు ‘కివీ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను నువ్వు ఎదుర్కోగలవన్న నమ్మకం మాకు లేదు’ అని రోహిత్ ముఖాన చెప్పినట్లే అని వ్యాఖ్యానించాడు. ఇషాన్ కిషన్‌ది హిట్ ఆర్ మిస్ కేసని, అతను ఆడతాడో లేదో చెప్పలేమని గవాస్కర్ అన్నాడు.
‘ఒకవేళ ఇషాన్ అద్భుతంగా ఆడి ఓ 70 పరుగులు చేస్తే అందరం మెచ్చుకుంటాం. కానీ అది జరగలేదు. ఈ ప్లాన్ వర్కవుట్ కాకపోతే విమర్శలు తప్పవు. ఓడిపోతామన్న భయంతో చేశారా లేదా తెలియదు కానీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పులేవీ ఉపయోగపడలేదు’ అని గవాస్కర్ విమర్శించాడు.
ఇషాన్ కిషన్‌ను 4 లేదా 5వ స్థానంలో దింపాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతన్ని ఓపెనింగ్ పంపడమంటే బౌల్ట్‌ను రోహిత్ ఎదుర్కోలేడని జట్టు నమ్మినట్లేనని, ఇలాంటి నిర్ణయాలు ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పాడు.