T20 World Cup | తరౌబా: గత ఏడాది కాలంగా నిలకడైన విజయాలతో ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్లకు సైతం షాకులిస్తున్న అఫ్గానిస్థాన్.. టీ20 వరల్డ్ కప్ తాజా ఎడిషన్‌లో సూపర్-8కు చేరింది. పొట్టి ప్రపంచకప్‌లో ఆ జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. శుక్రవారం తరౌబా వేదికగా పపువా న్యూగినీ (పీఎన్జీ)తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో రషీద్ ఖాన్ సేన తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. గ్రూప్-సీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ గెలవడంతో అగ్ర జట్టు న్యూజిలాండ్ కథ గ్రూప్ స్టేజ్‌తోనే ముగిసింది. ఆ జట్టు రెండు మ్యాచ్‌లలోనూ ఓడి ఇంటిదారి పట్టింది. ఇలా టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే కివీస్ నిష్క్రమించడం ఇదే తొలిసారి.
మొదట బ్యాటింగ్ చేసిన పీఎన్జీని అఫ్గాన్ బౌలర్లు 19.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ జట్టు పేసర్ ఫజల్హక్ ఫరూఖీ (3/16) మరోసారి విజృంభించగా నవీన్ ఉల్ హక్ (2/4) రాణించడంతో ప్రత్యర్థి బ్యాటర్లు విలవిల్లాడారు. పీఎన్జీ తరఫున కిప్లిన్ డొరిగ (27) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని అఫ్గాన్ 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుల్బాదిన్ నయీబ్ (36 బంతుల్లో 49 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఫారుఖీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
వర్షం కారణంగా స్కాట్లాండ్ మ్యాచ్ అర్ధాంతరంగా రైద్దె ఆసీస్ చేతిలో ఓడటంతో సూపర్-8 బెర్తు ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చెలరేగింది. అంటిగ్వా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట ఒమన్‌ను 47 పరుగులకే ఆలౌట్ చేసిన బట్లర్ సేన ఆ తర్వాత 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకోవడమే గాక నెట్ రన్‌రేట్‌ను భారీగా పెంచుకుంది. నాలుగు వికెట్లు తీసిన ఆదిల్ రషీద్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆసీస్ గనక ఓడితే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కథ ముగిసినట్టే!