కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ అదిరిపోయే బోణీ కొట్టింది. చారిత్రక ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షిమ్రాన్ హెట్‌మైర్ ధనాధన్ అర్ధసెంచరీకి తోడు రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ ఫీట్‌తో విండీస్ దుమ్మురేపింది. విండీస్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షెఫర్డ్(5/20) ధాటికి స్కాట్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌పై బహిష్కరణతో ఆఖరి నిమిషంలో మెగాటోర్నీ బెర్తు దక్కించుకున్న స్కాట్లాండ్ బ్యాటింగ్‌లో అంతగా ప్రభావం చూపించలేకపోయింది.
కెప్టెన్ రిచీ బెరింగ్టన్(42), టామ్ బ్రూస్(35) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. షెఫర్డ్ వేసిన 17వ ఓవర్లో మాథ్యూ క్రాస్(11), మిచెల్ లీస్క్(0), ఒలీవర్ డెవిడ్సన్(0) వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. తొలుత హెట్‌మైర్(36 బంతుల్లో 64, 2ఫోర్లు, 6సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో విండీస్ 20 ఓవర్లలో 182/5 స్కోరు చేసింది. ఓపెనర్లు కింగ్(35), కెప్టెన్ హోప్(19) దూకుడైన ఆరంభం అందించలేకపోయారు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో మైదానం నలువైపులా అలరించిన హెట్‌మైర్ 22 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.