బ్రిస్టల్: టీ20 వరల్డ్ చాంపియన్ భారత్‌కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయ కత్వంలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ కోల్పోయింది. ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 నాటౌట్) మెరిసినా మిగతా వాళ్లంతా నిరాశపరచడంతో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ టీమ్ చేతిలో చిత్తయింది. భారత్ ఇచ్చిన 159 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 13.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 నాటౌట్), ఫిల్ సాల్ట్ (59 నాటౌట్) దంచికొట్టారు. దాంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐదు టీ20 సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది.
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15) ఓ సిక్స్, ఫోర్ కొట్టి మరోసారి ఆర్చర్‌కు వికెట్ ఇచ్చుకోగా.. ఇషాన్ (4), అభిషేక్ (16) ఫెయిలయ్యారు. 48/3తో భారత ఇబ్బందుల్లో పడిన దశలో కెప్టెన్ అయ్యర్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. శివమ్ దూబే (22) కాసేపు సహకారం అందించినా తిలక్ (11), సుందర్ (5) నిరాశపరచడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. ఆర్చర్ (2/20), జోష్ టంగ్ (2/36) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య చివరి, ఐదో టీ20 శనివారం జరుగుతుంది.